అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actress Meena | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయం, సొగసుతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నటి మీనా మరోసారి వార్తల్లో నిలిచారు.
చిన్నతనంలోనే బుల్లితెరపై అడుగుపెట్టి, అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆమె టీనేజ్ వయసులోనే హీరోయిన్‌గా మారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగర్‌ని వివాహం చేసుకున్న మీనా, ఒక కూతురికి తల్లిగా మారారు. కానీ 2022లో భర్త మరణంతో ఆమె జీవితం ఒక్కసారిగా కుదేలైంది. ఆ కష్టకాలం తర్వాత కుమార్తె కోసం ధైర్యం చేసుకుని మళ్లీ సాధారణ జీవితం వైపు అడుగులు వేసింది.
ఇటీవల కాలంలో మీనా (Actress Meena) రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తరచుగా వస్తుండగా.. వాటిని ఆమె ఖండించారు. “నా జీవితాన్ని నేనే చూసుకుంటాను. రెండో పెళ్లి వార్తలు అసత్యం. ప్రస్తుతం నా కూతురుతో కలిసి జీవితంపై దృష్టి పెట్టాను” అంటూ స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనా తన కెరీర్‌లోని ఆసక్తికర అంశాలను వెల్లడించారు. “ఒక సమయంలో రోజుకు నాలుగు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని. తినడానికి, నిద్రించడానికి టైమ్ ఉండేది కాదు. ఆ సమయంలో బాలీవుడ్ (Bollywood) నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి కానీ నాకవన్నీ చేయడం సాధ్యం కాలేదు. అక్కడ షూటింగ్ టైమ్ ఎక్కువగా పడుతుందనే భయం ఉండేది” అని చెప్పారు.
అదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తితో (Mithun Chakraborty) జరిగిన ఓ ఆసక్తికర అనుభవాన్ని కూడా పంచుకున్నారు. “ఊటీలో మిథున్ చక్రవర్తికి ఓ హోటల్ ఉండేది. అక్కడ ఎక్కువ సినిమాల షూటింగులు జరిగేవి. నేనెప్పుడైనా అక్కడికి వెళ్తే ఆయన నా గది దగ్గరికి వచ్చి.. ‘మనిద్దరం ఎప్పుడు సినిమా చేద్దాం?’ అని ప్రేమగా అడిగేవారు. నాకు డేట్స్ అడ్జెస్ట్ అయ్యేవి కావు. ప్రతి సారి ఆయన అడిగేటప్పుడు సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించేది. చివరికి అక్కడ రూమ్ కూడా బుక్ చేయించుకోకుండా ఉండిపోయాను. అంత పెద్ద స్టార్‌తో సినిమా చేయలేకపోయానని తర్వాత చాలా బాధపడ్డాను” అని మీనా చెప్పారు.
