అక్షరటుడే, వెబ్‌డెస్క్: MEE SEVA CENTERS | మీ సేవ కేంద్రాల ముసుగులో పలువురు నిర్వాహకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి సామాన్యులను మోసగిస్తున్నారు. దొడ్డిదారిలో ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి అనర్హులు సైతం ప్రభుత్వ పథకాలు పొందేలా అండదండలు అందిస్తున్నారు.
నిజామాబాద్‌లోని పలు మీ సేవ కేంద్రాలు అక్రమాలకు కేంద్ర బిందువుగా మారాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, అమాయకులకు అంటగట్టి పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది.
MEE SEVA CENTERS | పట్టించుకోని రెవెన్యూ అధికారులు..
తాజాగా.. నాలుగో ఠాణా పరిధిలోని బోర్గాం మీ సేవ నిర్వాహకుడు బండి రవిపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసు నమోదైనప్పటికీ రెవెన్యూ (మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్) అధికారులు సదరు కేంద్రంపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు.
కాగా, ఈ మీసేవ కేంద్రంగా గతంలోనూ అనేక ఫేక్ సర్టిఫికెట్స్ బయటకు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బోర్గాంతోపాటు మోపాల్ మండలంలోని రెవెన్యూ రికార్డులకు సంబంధించిన పత్రాలు, ఎఫ్ఎంసీ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించారని ప్రచారంలో ఉంది.
ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ, రెవెన్యూ యంత్రాంగం మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే, నగరంలోని ఓ మీ సేవ కేంద్రంలో స్టాంప్ వెండింగ్, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్.. తదితర అన్ని కూడా ఒకేచోట జరుగుతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో సదరు నిర్వాహకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తప్పుడు ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు సైతం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మూడో ఠాణా పరిధిలో ఉన్న మరో మీ సేవ నిర్వాహకుడిపైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తికి సన్నిహితంగా ఉంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు భూములకు సంబంధించి కూడా రికార్డులు మార్చి, రిజిస్ట్రేషన్లు చేసినట్లు ప్రచారంలో ఉంది.
మీ సేవల ముసుగులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా.. అధికారులు చోద్యం చూస్తుండటంతో పలువురు పెదవి విరుస్తున్నారు. రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించి ఫోర్జరీ పత్రాలు సృష్టిస్తుండటంతో రాత్రికి రాత్రి దొంగ డాక్యుమెంట్లు పుట్టుకొస్తున్నాయి.
దీంతో ఖరీదైన ప్రైవేటు భూములు కలిగిన పలువురు తమకు జరిగిన అన్యాయంపై అధికారులకు విన్నవించినా.. ఫలితం ఉండటం లేదు. దీనికితోడు తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మీసేవ నిర్వాహకులు రోజుకో సంఘాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మీ సేవ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.