అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భారీవర్షాల నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ (Medical Health and Family Welfare) సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ఆదేశించారు.
గురువారం టీవీవీపీ (TVVP) కమిషనర్ అజయ్ కుమార్‌తో కలిసి జీజీహెచ్‌ను సందర్శించారు. జీజీహెచ్‌లో ఉన్న అత్యవసర వైద్యసేవల సదుపాయాల గురించి ఆరా తీశారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రతి మండల స్ధాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రస్థాయిలో (PHC) గ్రామాల వారీగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాలు ప్రతిరోజూ నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్య శిబిరాల నివేదికలు రోజు వారీగా ఉన్నతాధికారులకు సమర్పించాలన్నారు.
అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీ, సత్య గార్డెన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆరోగ్య శాఖ (Health Department) తరపున ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మందుల కొరత, ఇతర మౌలిక అవసరాల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అధిక వర్షాలతో (Heavy Rains) ఏర్పడే సమస్యల వల్ల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాటు చేసిన అత్యవసర సేవలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, జీజీహెచ్ (Kamareddy GGH) సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.