అక్షర టుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తూ వాటర్ ట్యాంక్ పైనుంచి పడి కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో ఆస్పత్రిలో చేరిన ఔట్సోర్సింగ్ కార్మికుడు (Outsourcing worker) మధును బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ (Bahujan Left Trade Union) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుడికి సంబంధించి పూర్తి వైద్యఖర్చులను సంబంధిత ఏజెన్సీ సంస్థనే భరించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ.. నగరంలోని కంఠేశ్వర్ జోన్-4 (Kanteshwar Zone) వాటర్ ట్యాంక్ పైనుంచి శనివారం తెల్లవారుజామున జారిపడి మధుకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.
దీంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. కార్మికుడు హైదరాబాద్కు (Hyderabad) చెందిన కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. కావున సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్ వైద్య ఖర్చులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాంట్రాక్టర్లు ఇటు అధికారులు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ఇప్పటికే అనేకసార్లు వినతి పత్రాలు అందజేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి గంగా శంకర్, వాటర్ సెక్షన్ యూనియన్ అధ్యక్షుడు రాహుల్, నాయకులు శ్రీశైలం, వసంత్ జాదవ్, కిరణ్, రాజేందర్, లైన్మెన్లు మోహన్, గంగారాం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.