అక్షరటుడే, కామారెడ్డి : గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఈ మేరకు రామారెడ్డి మండలం (Ramareddy Mandal) గిద్ద గ్రామంలో శుక్రవారం పర్యటించారు.
Collector Kamareddy | ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) కింద లబ్ధిదారుడు నిర్మించుకుంటున్న ఇంటిని పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు, తీసుకున్న రుణ వివరాలు, దశల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల కేటాయింపు పరిస్థితిపై ఆయన సమీక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, నాణ్యతతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
Collector Kamareddy | డ్రెయినేజీల పరిశీలన
అనంతరం గ్రామంలో డ్రెయినేజీ, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కల తొలగింపు పనులను కలెక్టర్ (Collector Ashish Sangwan) పరిశీలించారు. గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు చేపడుతున్న చర్యలను గమనించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పిచ్చిమొక్కలు, చెత్తను పూర్తిగా తొలగించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కల తొలగింపుతో పాటు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Collector Kamareddy | వందశాతం ఉత్తీర్ణత..
పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో చదవాలని, అందుకు తగిన విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని కలెక్టర్ అన్నారు. గిద్ద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో బోర్డుపై గణితశాస్త్ర లెక్కలు రాయించి, వారి విద్యాస్థాయిని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు.
Collector Kamareddy | అంగన్వాడీ విద్యార్థులతో న్యూ ఇయర్ వేడుకలు
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని (Anganwadi Center) కలెక్టర్ పరిశీలించారు. చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్‌కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని రిజిస్టర్లు, స్టోర్‌రూమ్‌ను పరిశీలించి, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని సూచించారు. ఆయన వెంట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డీవో వీణ, డీఈవో రాజు, తహశీల్దార్ ఉమలత, ఐసీడీఎస్ సిబ్బంది ఉన్నారు.