అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad CP | హైదరాబాద్ నగరంలో ఇటీవల డ్రగ్స్, గంజాయి దందా జోరుగా సాగుతోంది. పోలీసులు చర్యలు చేపడుతున్నా.. గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. ఈ క్రమంలో డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో (TGICCC) శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సీపీ సజ్జనార్ (CP Sajjanar) అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ భేటీకి ఐబీ, డీఆర్ఐ, ఎన్సీబీ, ఎక్సైజ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, ఎఫ్ఆర్ఆర్వో తదితర అధికారులు హాజరయ్యారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని ఏరిపారేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై ఎటువంటి నిఘా ఉంచుతామో.. డ్రగ్స్ నేరగాళ్లు, పెడ్లర్లపైనా అదే స్థాయి నిఘా పెడుతున్నట్లు పేర్కొన్నారు.
Hyderabad CP | హెచ్ న్యూ బలోపేతం
నగరంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌కు (drug network) చెక్ పెట్టేందుకు ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్’ (హెచ్-న్యూ)ను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బృందాలకు అదనంగా మరో నాలుగైదు కొత్త బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్కరోజుతో ముగిసే ప్రక్రియ కాదన్నారు. అది నిరంతర పోరాటమని చెప్పారు. అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఇకపై ప్రతినెలా అన్ని ఏజెన్సీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, కేసుల పురోగతిని సమీక్షిస్తామన్నారు. డ్రగ్స్ కట్టడికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని తెలిపారు.