అక్షరటుడే, వెబ్‌డెస్క్: CP Sajjanar | సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో (Hyderabad city) అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
సైబర్ నేరాలతో నిత్యం ఎంతో మంది మోసపోతున్నారు. ప్రజలను నమ్మించి సైబర్ దొంగలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వారిని పట్టుకోవడం పలు సందర్భాల్లో కష్టం అవుతోంది. దీంతో పోలీసులు నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే వీటిని నియంత్రించ వచ్చని భావించారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో ఇకపై ప్రతి మంగళ , శనివారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని కాలనీల్లో పోలీసులు సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.
CP Sajjanar | నిత్యం రూ.కోటి మోసం
అవగాహనతోనే సైబర్ నేరాలను అడ్డుకోవచ్చని సీపీ అన్నారు. నగరంలో నిత్యం సుమారు రూ.కోటి వరకు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారని చెప్పారు. ఈ నేరాలు పెద్ద సవాల్‌గా మారాయాన్నారు. ఆశపెట్టి, భయపెట్టి వారు అకౌంట్లను ఖాళీ చేస్తారని చెప్పారు. అత్యాశకు పోవద్దని ఆయన సూచించారు. ఎవరు ఊరికే ఏది ఇవ్వరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాగే డిజిటల్ అరెస్ట్‌ల పేరిట సైతం ఇటీవల సైబర్ మోసాలు పెరిగాయన్నారు. ఏపీకే ఫైల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం క్రిస్టమస్, న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్ వోచర్ల పేరిట సైతం మోసాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.