Homeతాజావార్తలుillegal sand trafficking | మాయా మచ్చేంద్రా.. ఇసుక అక్రమార్కులకు ఎస్సై అండదండలు!

illegal sand trafficking | మాయా మచ్చేంద్రా.. ఇసుక అక్రమార్కులకు ఎస్సై అండదండలు!

నిజామాబాద్​ జిల్లా బోధన్​ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పూలు ఆరు కాయలు అన్నచందంగా కొనసాగుతోంది. ఈ అక్రమ వ్యవహారానికి బోధన్​ రూరల్​ ఎస్సై అండదండలు అందిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: illegal sand trafficking | ఇసుక అక్రమ మైనింగ్​ విషయంలో సీపీ సాయి చైతన్యపాతోపాటు పోలీసు ఉన్నతాధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ప్రత్యేకించి, బోధన్​ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్​ జరగకుండా.. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్​రెడ్డి ఇప్పటికే అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

అయినప్పటికీ పలువురు రెవెన్యూ, పోలీసు అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరి ఆదేశాలు కూడా లెక్కచేయకుండా అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారు.

నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇసుక అక్రమ రవాణా మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ప్రత్యేకించి బోధన్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​లో ఎస్​హెచ్​వోగా వ్యవహరిస్తున్న మచ్చేందర్​పై తీవ్రమైన అవినీతి ఆరోపనలు ఉన్నాయి.

గతంలో జిల్లా సరిహద్దు నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరిపించి మహారాష్ట్రకు లారీల్లో తరలించేలా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినట్లు ఈ అధికారిపై ఆరోపణలు ఉన్నాయి.

ఆ తర్వాత బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి రంగంలోకి దిగారు. ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకున్నారు. అయితే, కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న పోలీసులు తిరిగి ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందిస్తున్నట్లు సమాచారం.

illegal sand trafficking | నిశీరాతిరిలో..

బోధన్​ రూరల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని హంగర్గా, తగ్గెల్లి నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

ఈ ప్రాంతాల్లో నుంచి నిత్యం పదుల సంఖ్యల్లో టిప్పర్ల ద్వారా ఇసుకను తోడేస్తున్నారు. ప్రత్యేకించి తెల్లవారు జామున మూడు నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఈ దందా కొనసాగుతోంది.

ఆ సమయంలో పోలీసు సిబ్బంది ఎవరూ సదరు వాహనాలను ఆపకుండా ఉండేలా స్థానిక ఎస్​హెచ్​ఓ పక్కా ప్రణాళికతో ఈ అక్రమ ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.

హంగర్గా గ్రామానికి చెందిన ఈసాఖాన్​ ఈ ఇసుక అక్రమ రవాణా నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక ఎస్సై మచ్చేందర్​ అన్నీ తానై చూసుకోవడం గమనార్హం.

అయితే స్థానిక సీఐ, ఏసీపీలకు ఈ విషయాలేమీ పొక్కకుండా అత్యంత గోప్యంగా ఈ ఇసుక దందాను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించేది లేదని స్థానిక ఎమ్మెల్యే ప్రగల్భాలు పలుకుతుంటే.. మరోవైపు ఆయన ఇలాఖాలోనే ఎస్సైలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం కొసమెరుపు.

సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడంతో సుదర్శన్​రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రచారంలో ఉంది.

నీతి నిజాయితీ అని హడావుడి చేసే.. సుదర్శన్​ రెడ్డి, ఈ అక్రమాలకు పాల్పడుతున్న ‘రెడ్డి’ Police అధికారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

 

Must Read
Related News