అక్షరటుడే, వెబ్‌డెస్క్: Glenn Maxwell | ఆస్ట్రేలియా అరివీర భయంకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) పెద్ద షాక్ ఇచ్చాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో ఆసీస్‌ను విశ్వవిజేతగా నిలిపిన మ్యాక్స్‌వెల్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్(ODI format Retirement) ప్రకటించాడు. టీ20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతానని అంటున్నాడు. సోమవారం(జూన్ 2) పాడ్‌కాస్ట్‌లో మ్యాక్సీ తన నిర్ణయం వెల్లడించాడు. అయితే 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడతానంటూ తన అభిమానులకు ఊరటనిచ్చాడు. ప్రస్తుతం అంత గొప్ప ఫామ్‌లో లేని మ్యాక్స్‌వెల్‌కు ఆసీస్ టీ20 టీమ్‌లో అయినా చోటు దక్కుతుందా అని అనుకుంటున్న టైమ్‌లో.. అతను వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి, టీ20 వరల్డ్ కప్(T20 World Cup) ఆడతానంటూ ధీమా వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Glenn Maxwell | ఇక చాలు..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ ఆడడం లేదు. సీజన్ ప్రారంభంలో పంజాబ్ కింగ్స్ (Punjab super kings) తరఫున మ్యాక్సీ కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడారు. అయితే, ఇప్పుడు అతను జట్టులో ఎక్కడా కనిపించడం లేదు. వన్డే ప్రపంచ కప్-2027ను దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకున్నానని.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం తాను వైదొలుగుతున్నట్లు మ్యాక్సీ పేర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీతో చర్చించిన తర్వాతే 50 ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినట్లు 36 ఏళ్ల మ్యాక్స్‌వెల్ తెలిపాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 2012లో ఆస్ట్రేలియా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఒంటిచేత్తో కంగారూలకు అద్భుత విజయాలు అందించాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్-2023లో ఆఫ్ఘానిస్థాన్ మీద అతడు ఆడిన ఇన్నింగ్స్ అయితే క్రికెట్ లవర్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇక ఐపీఎల్(IPL) మెగా వేలంలో మాక్స్వెల్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మ్యాక్సీ అంత గొప్పగా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో ఎనిమిది సగటుతో 48 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మ్యాక్స్‌వెల్ కనిపించడం లేదు. రాను రాను 50 ఓవర్ల మ్యాచ్ ఆడేందుకు నా శరీరం సహకరించడం లేదు. వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాల్సిన సమయం ఇదే అని నాకు అనిపించింది అని గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వీడియోలో చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ స్టీవ్ స్మిత్ కూడా వన్డేలకు గుడ్ బై పలికిన విషయం తెలిసిందే.