అక్షరటుడే, వెబ్డెస్క్ : GHMC | జీహెచ్ఎంసీలో భారీగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆర్వీ కర్ణన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెంచింది. 27 మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీ మెగా సిటీగా మారింది. పరిధి పెంపుతో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు జోన్ల సంఖ్యను ఆరు నుంచి 12కు పెంచింది. సర్కిళ్లు సైతం పెరిగాయి. ఈ క్రమంలో కొత్త జోన్లు (New Zones), సర్కిళ్లను అధికారులను నియమించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులను బదిలీ చేస్తున్నారు. ఏళ్లుగా ఒకే చోట ఉన్నవారికి స్థానం చలనం కలిగించారు.
GHMC | 140 మందికి స్థానచలనం
జీహెచ్ఎంసీ పరిధిలోని 140 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. పాత, కొత్త సర్కిళ్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ విభాగంలోని AMCలను బదిలీ చేశారు. కాగా ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లను సైతం ఆయన బదిలీ చేసిన విషయం తెలిసిందే.
GHMC | ఎన్నికల కోసమేనా..
జీహెచ్ఎంసీ పాలకవర్గ పదవీకాలం ఫిబ్రవరిలో ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పదవీకాలం అయిపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, ఫిబ్రవరి లేదా మార్చిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారుల బదిలీలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు నెల రోజుల పాటు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ (Sanitation special drive) కూడా ప్రారంభించారు. ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.