అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. సోమవారం ఆమె శాసనమండలిలో మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై తాను ప్రశ్నించినందుకు కక్ష గట్టి సస్పెండ్ చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహం, అమరజ్యోతి, సచివాలయం, కలెక్టరేట్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగితే దిక్కులేదన్నారు. ఉద్యమ కారులను బీఆర్ఎస్ (BRS) నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్ట్‌ల కోసం బీఆర్ఎస్ హయాంలో రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు 14 లక్షల ఎకరాలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లతో ఓ కంపెనీకి భారీగా లాభం చేకూరిందన్నారు. తెలంగాణ వచ్చాక సదరు కంపెనీ యజమానికి తప్ప ఎవరికి ఏమీ జరగలేదన్నారు.
MLC Kavitha | నాయకుల దురాగతాలు
కేసీఆర్ (KCR) చుట్టూ ఉండే కొందరు ప్రజాప్రతినిధులు దురాగతాలు చేశారన్నారు. ఇసుక దందా చేసిన కొందరి వల్ల నేరెళ్ల ఘటన జరిగిందన్నారు. దానిపై నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నాటి బీర్ఎస్ ప్రభుత్వం (BRS Government) తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కేసీఆర్ తన చుట్టూ ఉండే నాయకులు అనేక దురాగతాలు చేస్తున్న పట్టించుకోకపోవడం సరికాదన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని తాను వ్యతిరేకించనన్నారు. తెలంగాణలో ఏమీ పీకి కట్టలు కట్టామని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నో పనులు ఉన్నాయన్నారు.
MLC Kavitha | అడ్డుకునే కుట్ర
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)ని స్థాపించి ఉద్యమంలోకి వచ్చానని కవిత చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరిక ముందే జాగృతిని స్థాపించా.. తెలంగాణ కోసమే ఉద్యమంలోకి వచ్చానని తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై చర్చలు జరిగాయన్నారు. అయితే పార్టీ ఒంటరిగా పోటీకి నిర్ణయించిందన్నారు. 2014 ఎన్నికల్లో తనను పిలిచి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. తాను ఎవరిని టికెట్ అడగలేదని చెప్పారు. పదవుల కోసం తాను టీఆర్ఎస్లోకి వెళ్లలేదన్నారు. పార్టీ చెప్పడంతో ఎంపీగా పోటీ చేసి గెలిచానన్నారు. అయితే మొదటి రోజు నుంచే తనను అడ్డుకోవడానికి కుట్ర చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
MLC Kavitha | అండగా నిల్వలేదు
ఎనిమిది ఏళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారని కవిత అన్నారు. పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు ఏనాడూ మద్దతు ఇవ్వలేదన్నారు. బీజేపీ సైతం తెలంగాణ (Telangana)ను మోసం చేసిందన్నారు. ఒక్క ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. బీజేపీపై తాను పోరాటం చేశానన్నారు. కేసీఆర్‌పై కక్షతో ఆ పార్టీ తనను జైల్లో పెట్టిందన్నారు. అయినా ఏనాడూ బీఆర్ఎస్ తనకు అండగా నిలబడలేదన్నారు. మూడేళ్లు తను ఒంటరిగా ఈడీ, సీబీఐతో పోరాటం చేశానని చెప్పారు.
MLC Kavitha | ఆస్తుల పంచాయితీ కాదు
తనది ఆస్తుల పంచాయతీ కాదని కవిత స్పష్టం చేశారు. లక్ష్మీనరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నట్లు తెలిపారు. తనది ఆత్మగౌరవ పంచాయితీ అన్నారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదన్నారు. అందుకే తన రాజీనామాను ఆమోదించాలి మండలి ఛైర్మన్‌ను కోరారు.
MLC Kavitha | ప్రజాస్వామ్యం లేదు
బీఆర్ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం పెద్ద జోక్ అన్నారు. అసలు ఆ పార్టీ రాజ్యాంగం 8 పేజీలే ఉంటుందని ఎద్దేవా చేశారు. తన వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్ధతి, నైతికత లేని బీఆర్ఎస్ నుంచి బయట పడినందుకు సంతోషంగా ఉందన్నారు. ధర్నా చౌక్ రద్దు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం అన్నారు. తాను ఆ రోజు నిర్ణయాన్ని వ్యతిరేకించానని చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.
MLC Kavitha | శక్తిగా తిరిగివస్తా..
తాను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తున్నట్లు కవిత తెలిపారు. ఇది తన ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమన్నారు. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోందున్నారు. కచ్చితంగా గొప్ప రాజకీయశక్తిగా ఎదుగుతామన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి కొత్త రాజకీయ పార్టీ పెడతామన్నారు.