అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) వేళ బీఆర్ఎస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ కారు రేసులో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ (ACB) పేర్కొంది.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ఫార్మూలా ఈ కారు రేస్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. పలుమార్లు కేటీఆర్ (KTR)ను సైతం విచారించింది. మంత్రివర్గం ఆమోదం లేకుండా.. కేటీఆర్ ఇష్టారాజ్యంగా నిధులు కేటాయించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
Formula E Race Case | బీఆర్ఎస్కు రూ.44 కోట్లు
ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ-కార్ రేసింగ్ కోసం స్పాన్సర్‌షిప్ ఇచ్చిన సంస్థ నుంచి ఈ ఫార్ములా ఆపరేషన్స్ సంస్థకు రూ.44 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. అనంతరం స్పాన్సర్‌షిప్ సంస్థ నుంచి రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ (BRS) తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక అందజేసింది.
Formula E Race Case | అనుమతి ఇవ్వాలని..
ఈ కేసులో ఏ1గా మాజీమంత్రి కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిలను ఏసీబీ పేర్కొంది. వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ గవర్నర్‌కు నివేదిక పంపింది. దీనికి గవర్నర్ ఆమోదించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వారిపై ఛార్జి షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధంగా ఉంది. అయితే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు కేటీఆర్‌ను రెండు సార్లు, అరవింద్‌కుమార్‌ను మూడు సార్లు ఏసీబీ విచారించింది.
Formula E Race Case | బీఆర్ఎస్ చుట్టూ ఉచ్చు
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరం (Kaleshwaram) విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ కేసు సీబీఐ టేకోవర్ చేసుకుంటే కేసీఆర్ (KCR) విచారణను ఎదుర్కోనున్నారు. మరోవైపు ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై ఛార్జీషీట్ దాఖలు చేయడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే కవిత (Kavitha) వ్యవహారంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కారు రేసు కేసులతో స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.