అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Excise Department | భారీగా అల్ప్రాజోలం, సీహెచ్వోడీని (CHOD) ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ స్వప్న (Excise CI Swapna) తెలిపిన వివరాల ప్రకారం.. కల్తీ కల్లు తయారు చేసేందుకు మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. చిక్లి వద్ద సుమారు కిలో వరకు అల్ప్రాజోలం (Alprazolam), సీహెచ్వోడీని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు.
Excise Department | కల్తీకల్లు మాఫియా పనే..
జిల్లాల్లో నిషేధిత అల్ప్రాజోలం, మత్తు పదార్థాలు పట్టుబడడం కొత్తేమీ కాదు. మత్తుపదార్థాల రవాణా అంతా కల్తీకల్లు మాఫియా కన్నుసన్నల్లోనే జరుగుతోందనేది బహిరంగ రహస్యం. జిల్లాలో కల్తీకల్లు మాఫియా పెట్రేగిపోతోంది. ఈతవనాల్లో సరిపడా కల్లు లేకున్నా యథేచ్ఛగా నిషేధిత మత్తు పదార్థాలతో కల్లును తయారుచేస్తున్నారు. దీంతో అమాయక శ్రమజీవులు దీనికి బానిసలుగా మారుతున్నారు. అనేక దీర్ఘకాలిక రోగాలకు గురవుతున్నారు. నగర పరిధిలో ఈతవనాల్లో సరిపడా కల్లు లేదు. అయినప్పటికీ నగరంలో ఉన్న అన్ని బట్టీల్లో కల్లు దొరుకుతుంది. దీనిని బట్టి చూస్తే కల్తీకల్లు యథేచ్ఛగా తయారుచేస్తున్నట్లు తెలిసిపోతుంది.