అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. రాజకీయ వ్యవహారాల్లో పరిణితి కనిపిస్తోంది. పాలనపై, పార్టీపై తన పట్టు క్రమంగా పెరుగుతోంది. తిట్ల దండకాన్ని ఆపేసిన సీఎం.. కత్తుల్లాంటి మాటలతో ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నారు.
ఊరికే ఊగిపోకుండా, ఆవేశపడకుండా మెల్లిగా, ఓర్పుగా ఒక్కో మాటను తూటాగా మార్చి పేల్చుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులను.. అందున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మాజీ మంత్రి కేటీఆర్(KTR)ను మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, అంతకు ముందు క్రెడాయ్ మీటింగ్‌లో కానీ రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుపై మార్గదర్శనం, విద్యావిషయంలో ప్రభుత్వ విధానాన్ని వెల్లడించడమే కాకుండా రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం, అదే సమయంలో పారిశ్రామిక వేత్తలు, విద్యావంతులకు సుతిమెత్తిగా హెచ్చరికలు జారీ చేయడం వరకూ.. మారిన రేవంత్‌రెడ్డిని కళ్లకు కడుతున్నాయి.
CM Revanth Reddy | మాటల్లో, చేతల్లో పరిణతి..
రేవంత్‌రెడ్డి ప్రసంగాలు పరిణతితో సాగుతున్నాయి. తన ఆలోచనల్ని, తన అడుగుల్ని, తన విమర్శలను సూటిగా చెప్పగలుగుతునున్నాడు. కింది స్థాయి నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. జడ్పీటీసీగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి చేరింది. ఈ కాలక్రమంలో అనేక కష్టనష్టాలు అనుభవించిన రేవంత్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎంతో ఎదిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత పరిణితం సాధించారు. నిన్న, మొన్నటిదాకా ప్రత్యర్థులపై తిట్లతో విరుచుకుపడిన ఆయనలో గుణాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తన చేతల్లో, ప్రసంగాల్లో వచ్చిన మార్పు ఆయన అనుభవాన్ని ఎత్తిచూపుతోంది. రాజకీయ ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడమే కాదు.. సొంత పార్టీలో తోక జాడిస్తున్న వారిని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. తన సీటుకు ఎసరు పెట్టిన వారిని గుర్తించి వారిని మచ్చిక చేసుకోవడంలో విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) లాంటి మరో 20 ఏళ్లు రేవంత్‌రెడ్డి సీఎంగా కొనసాగాలని చెబుతున్నారంటేనే సీఎం ఏ స్థాయిలో పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టు పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
CM Revanth Reddy | కేసీఆర్‌పై విమర్శల వాన..
ప్రజా జీవితానికి దూరంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ను రేవంత్ మామూలుగా ఆడుకోవట్లేదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తన లోపాల దాచుకున్న కోపాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు. అంతర్గతంగా గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే, గతంలో లాగా తొక్కుతా.. పేగులు మెడలో వేసుకుంటా అన్న వ్యాఖ్యలను వదిలేశారు. మాటల విషయంలో ఎక్కడా అదుపు తప్పడం లేదు. మాస్ ర్యాగింగ్(Mass Ragging) చేయడంలో ఆయన కొత్త పంథాను అనుసరిస్తున్నారు.
ఎన్ని సవాళ్లు విసురుతున్నా ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చెడుగుడు ఆడుతున్నాడు. నేను శిక్షించేది ఏముంది..? తనను తాను ఫామ్ హౌజు(Farm House)లో బంధించుకున్నాడు. అప్పుడప్పుడూ వచ్చీపోయే విజిటర్స్, పోలీస్ కాపలా… జైలులో కూడా అంతే కదా అని ఓసారి వెక్కిరించాడు. ‘కేసీఆర్ ను ఇంకా జైలులో పెట్టాల్న.. ఆయన ఇప్పుడు జైలు జీవితమే గడుపుతున్నారు కదా. జైలులో ఉంటే పోలీసులు కాపలా ఉంటుంది. అప్పుడప్పుడు ఒకరో ఇద్దరో కలిసి వెళ్తారు. ఇప్పుడు కేసీఆర్ గడుపుతున్నది కూడా జైలుజీవితమే. దానికి దీనికి, జైలు జీవితానికి తేడా ఏమున్నది’ అని రేవంత్ ఎద్దేవా చేశారు.
CM Revanth Reddy | విమర్శలకు దీటైన కౌంటర్లు
ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పుకొడుతున్నారు రేవంత్‌రెడ్డి. తన ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ తరచూ చేస్తున్న విమర్శలను సీఎం పలుమార్లు తీవ్రంగా ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) ఢిల్లీలోనే ఉందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల కోసం ఢిల్లీకి కాకుంటే బెంగళూరుకో, మద్రాసుకో పోలేము కదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటేనే కొన్ని పనులు జరుగుతాయని, బీఆర్ ఎస్ నాయకులు అలా చేయకపోవడం వల్లే తెలంగాణ(Telangana)కు తీవ్ర అన్యాయం జరిగిందని దెప్పి పొడిచారు. ఇలా సందర్భంగా దొరికిన ప్రతిసారీ రేవంత్‌రెడ్డి బీఆర్ ఎస్‌ను టార్గెట్‌గా చేస్తూ వస్తున్నారు.
CM Revanth Reddy | దొంగల వెనుక నేనెందుకుంటా?
చివరకు కవిత ఎపిసోడ్ వ్యవహారంలోనూ ఆయన దీటుగా కౌంటర్ ఇచ్చారు. హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించగా, ఆమె వెనుకే రేవంత్‌రెడ్డి ఉన్నారని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయా ఆరోపణలపై రేవంత్ స్పందిస్తూ ఇరువురిపై సెటైర్లు వేశారు. ప్రజలు తిరస్కరించిన వారి వెనుక నేను ఎందుకు ఉంటానని ప్రశ్నించారు. కుల, కుటుంబ పంచాయితీల్లోకి తనకు లాగొద్దని హితవు పలికారు. వాళ్లే తన్నుకని చస్తున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్లని వాళ్లే పొడుచుకుంటున్నారని తెలిపారు. విపరీతంగా సంపాదించిన అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతోనే వారు కొట్టుకుంటున్నారని, అంతచెత్తగాళ్ల వెనుకాల నేనేఎందుకుంటా? అని ప్రశ్నించారు. నాయకుడిగా ఉంటే ముందర ఉంటా కానీ, వెనుక ఉండాల్సిన అవసరం ఏముందని పేర్కొన్నారు. దిక్కుమాలినోళ్లనే కదా.. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిండ్రు. తెలివి ఉన్న వాడు ఎవడైనా మీ వెనుక ఉంటారా? అని ప్రశ్నించారు. కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి వారు.. కాలగర్భంలో కలిసిపోతారని వ్యాఖ్యానించారు.