HomeజాతీయంMary Kom | మేరీ కోమ్ ఇంట్లో భారీ దొంగతనం.. లక్షల విలువైన వస్తువులు గల్లంతు

Mary Kom | మేరీ కోమ్ ఇంట్లో భారీ దొంగతనం.. లక్షల విలువైన వస్తువులు గల్లంతు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mary Kom | భారత బాక్సింగ్ చాంపియన్, ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీ కోమ్ (Mary Com) ఇంట్లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. హర్యానా (Haryana) రాష్ట్రం ఫరీదాబాద్‌ సెక్టార్ 46లోని ఆమె నివాసంలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

మేరీ కోమ్ ఒక మారథాన్ కార్యక్రమంలో పాల్గొనడానికి మేఘాలయలోని (Meghalaya) సోహ్రాకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని ఉపయోగించుకుని దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. మెరీ కోమ్ నివసిస్తున్న రెండు అంతస్తుల బంగ్లాకు తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి లక్షల రూపాయల విలువైన వస్తువులు, టెలివిజన్ సహా పలు వస్తువులను అపహరించారు. ఈ దృశ్యాలన్నీ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో (CC Cameras) రికార్డయ్యాయి.

Mary Kom | పొరుగువారు గమనించి సమాచారం

ఈ దోపిడీ ఘటనను పొరుగువారు గమనించి వెంటనే మేరీ కోమ్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఈ విషయంపై స్పందించిన మేరీ కోమ్, “నాకు చాలా భయంగా, ఆందోళనగా ఉంది. ఈ చోరీ సెప్టెంబర్ 24న జరిగినట్లుగా తెలుస్తోంది. నేను ఇంటికి తిరిగి వెళ్లాకే మొత్తం నష్టం ఎంత జరిగిందో తెలుసుకోగలను. సీసీటీవీలో CC Tv దొంగలు టీవీ, ఇతర వస్తువులు తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను” అని తెలిపారు.ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఫరీదాబాద్ పోలీసులు (Faridabad police) ‘వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు Police తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో బిజీగా ఉన్నామని వెల్లడించారు. దేశానికి ఎన్నో గౌరవాలు తెచ్చిన స్పోర్ట్స్ ఐకాన్ మేరీ కోమ్ ఇంట్లో జరిగిన ఈ దొంగతనంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎలాంటి నష్టం వాటిల్లిందో, నిందితులు ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని ఆశిస్తున్నారు.

Must Read
Related News