అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | వివిధ దేశాలపై యూఎస్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లు (Global markets) ఒత్తిడికి లోనవుతున్నాయి. మన దేశంపై 25 శాతం సుంకాలను విధించడంతో మన మార్కెట్లు సైతం ఒడిదుడుకులకు గురవుతూ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 111 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 182 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 425 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 34 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 62 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 112 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడంతో మళ్లీ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 262 పాయింట్ల నష్టంతో 80,922వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 24,662 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | ఫార్మా రంగంలో తీవ్ర ఒత్తిడి..
యూఎస్ సుంకాల (US tariffs) ప్రభావంతోపాటు ఔషధాల ధరలు తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా (Pharma) కంపెనీలకు లేఖ రాయడంతో ఫార్మా స్టాక్స్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఐటీ(IT)లో సెల్లాఫ్ ఆగడం లేదు. ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం రంగాలూ నష్టపోతున్నాయి.
బీఎస్‌ఈలో ఫార్మా ఇండెక్స్ 1.88 శాతం పడిపోగా.. ఆయిల్ అండ్ గ్యాస్ 1.37 శాతం, ఐటీ 1.19 శాతం, టెలికాం 1.13 శాతం, మెటల్, ఎనర్జీ ఇండెక్స్‌లు 0.80 శాతం, ఆటో 0.77 శాతం, ఇన్‌ఫ్రా 0.74 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.72 శాతం నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.93 శాతం పెరగ్గా.. కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.30 శాతం, పవర్ 0.28 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.15 శాతం లాభాలతో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం నష్టాలతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో ఉండగా.. 21 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఆసియా పెయింట్ 2.19 శాతం, ట్రెంట్ 1.77 శాతం, హెచ్‌యూఎల్ 1.38 శాతం, ఐటీసీ 1.26 శాతం, కొటక్ బ్యాంక్ 1.01 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : సన్ ఫార్మా 4.09 శాతం, టాటా స్టీల్ 2.41 శాతం, టాటా మోటార్స్ 2.33 శాతం, టెక్ మహీంద్రా 1.82 శాతం, ఇన్ఫోసిస్ 1.79 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.