HomeజాతీయంAshanna Surrender | మావోయిస్టుల లొంగు‘బాట’.. ఛత్తీస్​గఢ్​ సీఎంకు ఆయుధాలు అప్పగించిన ఆశన్న

Ashanna Surrender | మావోయిస్టుల లొంగు‘బాట’.. ఛత్తీస్​గఢ్​ సీఎంకు ఆయుధాలు అప్పగించిన ఆశన్న

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న లొంగిపోయారు. 208 మంది సభ్యులతో ఛత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​కు ఆయన ఆయుధాలు అప్పగించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ashanna Surrender | మావోయిస్టుల లొంగు‘బాట’ కొనసాగుతోంది. కీలక నేతలు ఆయుధాలు విడిచి ప్రభుత్వం ఎదుట సరెండర్​ అవుతున్నారు. అన్నలు అడవులను వదిలి జనం బాట పడుతున్నారు. తాజాగా మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగిపోయారు (Ashana surrendered).

మావోయిస్టు అగ్రనేత ఆశన్న శుక్రవారం ఛత్తీస్​గఢ్​లో (Chhattisgarh) సరెండర్​ అయ్యారు. ఆయనతో పాటు 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ (Chhattisgarh CM Vishnu Dev)​, హోంమంత్రి సమక్షంలో నక్సల్స్​ తమ ఆయుధాలు అప్పగించారు. ఆశన్న అలియాస్​ తక్కళ్లపల్లి వాసుదేవరావు బీజాపూర్ మావోయిస్టు కేంద్రకమిటీ (Bijapur Maoist Central Committee) సభ్యుడిగా పని చేశారు. ఆయనతో పాటు కీలక నేతలు మాడ్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జి రణిత, నలుగురు దండకారణ్య స్పెషల్​ జోన్​ కమిటీ సభ్యులు సైతం లొంగిపోయారు.

Ashanna Surrender | కంచుకోటలు ఖాళీ అవుతున్నాయి..

ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలు సైతం ప్రస్తుతం ఖాళీ అవుతున్నాయి. బస్తర్, అబూజ్‌మడ్ ప్రాంతాల్లో మావోలు సరెండర్​ అయ్యారు. ఆపరేషన్​ కగార్​తో మావోయిస్టులు తమ పంథా మార్చుకున్నారు. ఇప్పటికే చాలా మందిని ఎన్​కౌంటర్లలో కోల్పోవడంతో మిగతా వారు ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్​రావు అలియాస్​ సోనూ 61 మందితో మహారాష్ట్ర సీఎం (Maharashtra CM) ఎదుట లొంగిపోయారు. తాజాగా ఆశన్న 208 మందితో సరెండర్​ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమను కాపాడుకోవాలంటే లొంగిపోవడం ఒకటే మార్గమని ఆశన్న తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. మిగతా వారు సైతం లొంగిపోవాలనుకుంటే తనను సంప్రదించాలని ఆయన కోరారు.

Ashanna Surrender | భారీ విజయం

మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా (Union Home Minister Amit Shah) స్పందించారు. 2026 మార్చి 31 వరకు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలో మావోయిస్టులు లొంగిపోవడం భారీ విజయం అని ఆయన పేర్కొన్నారు. హింసను త్యజించి, భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయానికి వారిని ఆయన అభినందించారు. నక్సలైట్లపై తమ విధానం స్పష్టంగా ఉందన్నారు. లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం పలుకుతామని, అయితే ఆయుధాలు వీడని వారికి మాత్రం భద్రతా దళాల నుంచి కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మావోయిస్టులు అందరూ తమ ఆయుధాలను అప్పగించి జన జీవన స్రవంతిలోకి రావాలని ఆయన సూచించారు.