అక్షరటుడే, వెబ్డెస్క్ : Karreguttalu | తెలంగాణలోని ములుగు జిల్లా (Mulugu District) వెంకటాపురం సరిహద్దులో గల కర్రెగుట్టల్లో మరోసారి భారీగా సాయుధ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.
కర్రెగుట్టలు తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య విస్తరించి ఉన్నాయి. దట్టమైన ఈ అడవుల్లో మావోయిస్టులు గతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 20 వేల బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టలు (Operation Karregutta) చేపట్టాయి. దాదాపు 22 రోజులు అడవులను జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోలు చనిపోయారు. అలాగే నక్సల్స్ బంకర్ (Naxals Bunker)లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అంతేగాకుండా ఆయుధాలను సైతం పట్టుకున్నాయి. తాజాగా మరోసారి ఆపరేషన్ చేపట్టడం గమనార్హం.
Karreguttalu | హిడ్మా దళం కోసం!
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మా దళం కర్రెగుట్టల్లో ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతోనే దాదాపు 5 వేల బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. థర్మల్ సెన్సార్ డ్రోన్ కెమెరాల్లో మావోల కదలికలను గుర్తించాయి. దీంతో అడవులను జల్లెడ పడుతున్నాయి. కాగా ఏప్రిల్ 24 నుంచి మే 7 వరకు చేపట్టిన ఆపరేషన్లో బలగాలు 5 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. మావోయిస్టుల సొరంగాలు, గుహలు ఉన్నట్టుగా గుర్తించారు.
ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ పార్టీ (Maoist Party) బలహీనంగా మారింది. ఇప్పటికే కీలక నేతలు హతం అయ్యారు. పలువురు అగ్రనేతలు లొంగిపోయారు. దీంతో టాప్ కమాండర్ హిడ్మా (Top Commander Hidma)ను పట్టుకుంటే ఉద్యమం మరింత బలహీనం అవుతుందని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కోసం ప్రత్యక ఆపరేషన్లు చేపడుతోంది. అయితే హిడ్మా మాత్రం బలగాలకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.