అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం ముగింపు దశకు వచ్చింది. దశాబ్దాల మావోయిస్టు పార్టీ ఇక కాలగమనంలో కలిసిపోనుంది. వరుస ఎన్‌కౌంటర్లతో పాటు లొంగుబాట్లతో పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యులు సహా వందలాది మంది హతం కావడం, అదే స్థాయిలో లీడర్లు, కేడర్ లొంగిపోవడం, కొత్త రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ ఇక చరిత్రలో మిగిలి పోయే స్థితికి చేరింది.
మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ తిప్పిరి తిరుపతి (Tippiri Tirupati) అలియాస్ దేవ్‌జీ, పోలిట్ బ్యూరో సభ్యుడు రాజిరెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా ఉన్న నంబాల కేశవరావు (Nambala Keshava Rao) గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అనంతరం సెప్టెంబర్‌లో దేవ్‌జీకి పార్టీ ఆ బాధ్యతలు అప్పగించింది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు భారీ సంఖ్యలో హతం అయ్యారు. కొత్తగా రిక్రూట్‌మెంట్లు సైతం లేవు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు మాత్రమే వారు పరిమితం అయ్యారు. ఈ క్రమంలో దేవ్‌జీ పార్టీ సెక్రెటరీగా నియామకం అయ్యారు. పార్టీని ముందుడి నడపాల్సిన ఆయన తాజాగా లొంగిపోయారు. దీంతో కేడర్‌లో సైతం నిస్తేజం అలుముకునే అవకాశం ఉంది.
Maoist Movement End Phase | కేడర్‌లో అయోమయం
జగిత్యాల (Jagityal) జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ మిలటరీ ఆపరేషన్లలో దిట్ట. గతంలో ఆయన పలు కీలక బాధ్యతల్లో పనిచేశారు. నంబాల మృతితో ఖాళీగా ఉన్న పదవికి పలువురి పేర్లు పరిశీలనలోకి రాగా.. కేంద్ర కమిటీ తిరుపతి వైపు మొగ్గు చూపింది. అయితే ఆయన లొంగుబాటు పార్టీకి షాక్ అని చెప్పాలి. మరోవైపు పెద్దపల్లికి మల్లా రాజిరెడ్డి (Malla Rajireddy) సైతం సరెండర్ అయ్యారు. ఆయన ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగున్నారు. వీరితో పాటు మరో 14 మంది లొంగిపోయినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పార్టీ అగ్ర నాయకత్వం ఎన్కౌంటర్లలో హతం అవుతుండటం, లొంగిపోతుండటంతో కేడర్‌లో అయోమయం నెలొకొంది. దీంతో వారు సైతం ఆయుధాలు వీడే అవకాశం ఉంది.
Maoist Movement End Phase | ఆపరేషన్ కగార్ విజయవంతం
దేశంలో నాలుగు దశాబ్దాలకు పైగా మావోయిస్ట్ పార్టీ మనుగడ సాగించింది. పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరిలో పుట్టి అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలో మావోల ప్రాబల్యం అధికంగా ఉండేది. 2004 తర్వాత ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే ఇతర రాష్ట్రాలో వారు బలంగానే ఉండేవారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోలపై నిర్బంధం అమలు చేసింది. 2026 మార్చి 31 వరకు మావోయిజం లేకుండా చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. ఈ ఆపరేషన్ విజయవంతం అయింది.
Maoist Movement End Phase | రక్షణకే పరిమితం
వేలాది బలగాలు అడవులను జల్లెడ పట్టాయి. గతంలో మావోయిస్టులు పోలీసులు, నాయకులపై దాడులు చేసేవారు. ఆపరేషన్ కగార్ ధాటికి వారు తమను తాము రక్షించుకోవడంపై దృష్టి పెట్టారు. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పట్టాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోని మావోయిస్టుల పని పట్టాయి. గతంలో నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న ప్రాంతాలను సైతం బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో మావోయిస్ట్‌లకు షెల్టర్ జోన్లు కరువయ్యాయి. ఈ క్రమంలో వందలాది మంది ఎన్కౌంటర్లలో చనిపోగా.. మిగతా వారు ఆయుధాలు వీడి సరెండర్ అవుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు మావోయిస్ట్ ఉద్యమం పట్ల నేటి యువత ఆకర్షితులు కావడం లేదు. దీంతో రిక్రూట్‌మెంట్లు లేక పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా కీలక నేతలు లొంగిపోవడంతో కేంద్రం పెట్టుకున్న గడువు ప్రకారం.. మార్చి 31 లోగా మావోయిజం అంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
దామోదర్ కోసం వేట
మావోయిస్టు పార్టీలో కొంత మంది కీలక నేతలు మాత్రమే ప్రస్తుతం ఉద్యమంలో ఉన్నారు. అందులో గణపతి అలియాస్ లక్ష్మణ్‌రావు అనారోగ్యంతో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. మరో నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మాత్రం అడవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడి కోసం బలగాలు గాలిస్తున్నాయి. మొత్తంగా పార్టీలో 300 లోపు మావోయిస్టులు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి కోసం అడవుల్లో గాలిస్తున్నారు.
