అక్షరటుడే, కామారెడ్డి: Maoist lokoti chander | మూడున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన లోకోటి చందర్ అలియాస్ పడకల్ స్వామి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భ భమ్రఘడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చందర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆయన కుమారుడు లోకోటి రమేష్ శనివారం గడ్చిరోలి వెళ్లారు. ఆదివారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Maoist lokoti chander | దశాబ్దాల కాలం పాటు
దశాబ్దాల కాలం పాటు బానిసత్వానికి గురై పీడించబడుతున్న ప్రజల పక్షాన నిలబడిన విప్లవ వీరుడు నేలకొరగడంతో ఇస్రోజీవాడి గ్రామం కన్నీటి పర్యతమైంది. చివరిసారిగా నివాళులర్పించేందుకు వివిధ జిల్లాల నుంచి పౌరహక్కుల సంఘం నేతలు పెద్దఎత్తున గ్రామానికి చేరుకున్నారు. లోకోటి చందర్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నేతల నివాళి
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేస్తారని ఓటేసి గద్దెమీద కూర్చోబెడితే ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులను మొత్తంగా ఏరివేయడానికి మార్చి 31 డెడ్ లైన్ పేరుతో బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లలో చనిపోయేది ఆదివాసీలు, గిరిజన బిడ్డలేనన్నారు. ఇవి ప్రభుత్వ హత్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ బూటకపు ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
1990లో ఉద్యమంలోకి..
కాగా.. గ్రామానికి చెందిన లోకోటి చందర్ అలియాస్ స్వామి 1990 సంవత్సరంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై అందులో చేరాడు. అనంతరం డిప్యూటీ కమాండర్, కమాండర్‌గా ఎదిగారు. ప్రస్తుతం వెస్ట్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా కొనసాగుతూ గడ్చిరోలి ఎన్ కౌంటర్లో మృతి చెందారు. లోకోటి చందర్‌తో పాటు ఆయన భార్య సులోచన కూడా దండకారణ్యంలో చేరి దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వీరి కుమారుడు లోకోటి రమేష్, లోకోటి లావణ్య సైతం తల్లిదండ్రుల బాటలోనే దండకారణ్యంలో చేరారు. డిసెంబర్ 2న లోకోటి రమేష్ పోలీసులకు లొంగిపోగా లావణ్య మాత్రం ఆరు నెలల క్రితం ఛత్తీస్‌ఘడ్‌లో అరెస్టయి జైలులో ఉన్నారు.