అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists | మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ క్యాడర్‌కు లేఖ రాశారు. ఆయుధాలు వీడి జనంలోకి రావాలని ఆయన సూచించారు.
తాము ఆయుధాలు వీడడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీతో చర్చించకుండా మల్లోజుల (Mallojula Venugopal) లేఖ రాశారని మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. వేణుగోపాల్ ఆయుధాలు అప్పగించాలని పార్టీ సూచించింది. ఈ క్రమంలో తాజాగా మల్లోజుల మరో లేఖతో జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) బతికున్నప్పుడే ఆయుధాలు వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Maoists | పార్టీ నుంచి తప్పుకుంటున్నా..
పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చిందని మల్లోజుల అన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 22 పేజీల లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ (Maoist Party) ఇప్పటి వరకు కొనసాగించిన పంథా తప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Maoists | మల్లోజుల ఎవరంటే..
మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లి జిల్లాకు (Peddapalli District) చెందిన వారు. 2011లో ఎన్కౌంటర్లో చనిపోయిన కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. ఆయన భార్య తారక్క 2018 ఎన్కౌంటర్ మరణించారు. 1970లో ఉద్యమ బాట పట్టిన ఆయన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లాల్‌గడ్ ఉద్యమానికి వేణుగోపాల్ నాయకత్వం వహించారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ పొలిట్ బ్యూరో సభ్యురాలు పోతుల సుజాత వేణుగోపాల్ అన్న భార్య కావడం గమనార్హం.