అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoist Devji | మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (Special Zone Committee) ఆరోపిస్తోంది. ఆయనతో పాటు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. వారిని కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు లేఖ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల ఎన్కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత మాడ్వి హిడ్మా (Madvi Hidma), ఆయన భార్య రాజే, టెక్ శంకర్ సహా పలువురు మృతి చెందారు. అనంతరం తెలంగాణ పోలీసుల ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ సమయంలో దేవ్జీ కూడా లొంగిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాల సాంబయ్య అలియాస్ ఆజాద్ సహా పలువురు సరెండర్ అయ్యారు.
Maoist Devji | దండకారణ్యం బంద్‌కు పిలుపు
హిడ్మా ఎన్కౌంటర్ సమయంలోనే దేవ్జీ సహా 50 మందిని అదుపులోకి తీసుకున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని లేఖలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న దండకారణ్యం బంద్‌కు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ పిలుపునిచ్చింది. దేవ్జీని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని కోరింది. అయితే మావోయిస్టుల లేఖపై తెలంగాణ పోలీసులు (Telangana Police) స్పందించారు. దేవ్జీ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. దేవ్జీ బంధువులు ఏపీ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు సైతం తమ ఆధీనంలో లేరని కోర్టుకు తెలియజేశారు.
తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధమని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మరోవైపు దండకారణ్యం బంద్‌కు స్పెషల్ జోన్ కమిటీ పిలుపునిచ్చింది. దీంతో రెండు కమిటీలు కలిసి ఆయుధాలు వీడుతాయా.. లేక ఎంఎంసీ కమిటీ సభ్యులు మాత్రమే సరెండర్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది.