అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Umang | ఆధునిక సాంకేతికతను ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నాయి. సాంకేతికత సాయంతో ప్రజలకు మరింత సులువుగా సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలను ఒక దగ్గర పొందేలా కేంద్రం ఉమంగ్ యాప్ (Umang App)ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సేవలతో పాటు, కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా ఈ యాప్ ద్వారా సులువుగా పొందవచ్చు. ఆయా సేవలకు సంబంధించి ప్రతి దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. అయితే ప్రజలకు వాటి గురించి అవగాహన లేక గతంలో ఇబ్బందులు పడేవారు. ఉమంగ్ యాప్ అందుబాటులోకి రావడంతో ఒకే చోట అన్ని రకాల సేవలను పొందగలుగుతున్నారు.
Umang | అన్ని భాషల్లో..
ఉమంగ్ యాప్ సేవలు గుర్తింపు అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమ మాతృ భాషల్లో కూడా ఆయా సేవలను పొందగలగడం దీని ప్రత్యేకత. వివిధ పథకాల కోసం దీని ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆరోగ్య, అత్యవసర, ప్రయాణానికి సంబంధించిన సేవలను ఒకే చోట పొందే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు (Helpline Numbers) ఇందులో ఉంటాయి. అంతేగాకుండా గ్యాస్ బుకింగ్, ట్రాకింగ్ వంటి పనులు కూడా ఉమంగ్ ద్వారా చేయవచ్చు.
Umang | ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఉమంగ్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేసి కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఒకే ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు కావాల్సిన అన్ని రకాల సేవలు పొందవచ్చు. దీని కోసం చాలా ఖాతాలు యాడ్ చేసే అవకాశం ఉంది.
Umang | ఈ సేవలు పొందవచ్చు
ఉమంగ్ ద్వారా అనేక రకాల సేవలు పొందవచ్చు. కేంద్ర పథకాలకు సంబంధించిన వివరాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. వాటికి మనం అర్హులమో కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. అనంతరం అందులో ఉన్న వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కూడా ఉంది. ఈ యాప్ ద్వారా మొత్తం 2,339 కేంద్ర, రాష్ట్ర సర్వీసులను పొందవచ్చు. 209 ప్రభుత్వ శాఖలు దీనితో అనుసంధానం అయ్యాయి. ఇప్పటికే ఈ యాప్‌లో 8.94 కోట్ల మంది భారతీయులు రిజిస్టర్ చేసుకున్నారు.
Umang | ఈపీఎఫ్‌వో..
ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఈపీఎఫ్‌వో (EPFO) అకౌంట్ ఉంటుంది. పీఎఫ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ, నగదు ఉప సంహరణ, క్లెయిమ్ స్టాటస్ చూసుకోవడానికి వెబ్సైట్లో కొంత కష్టంగా ఉంటుంది. ఉమంగ్ ద్వారా ఈ సేవలను ఒక్క క్లిక్‌తో పొందవచ్చు. దీంతో చాలా మంది ఉమంగ్ ద్వారానే ఈపీఎఫ్‌వో లావాదేవీలు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా వృద్ధులు పింఛన్ల కోసం లైఫ్ సర్టిఫికెట్లను కూడా పొందవచ్చు.
Umang | హెల్ప్ లైన్ నంబర్లు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు అంశాలకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారం ఉమంగ్ యాప్‌లో ఉంటుంది. ఏ హెల్ప్‌లైన్ నంబర్ కావాలన్న క్షణాల్లో తీసుకోచ్చు. రేషన్, బిల్లుల చెల్లింపులు, ఈ-జిల్లా సర్వీసులు, పర్యాటకం, పోలీస్, న్యాయ సేవలు పొందవచ్చు. రైతులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన సేవలు ఇందులో ఉంటాయి.
Umang | బ్లడ్‌బ్యాంక్ సేవలు
బ్లడ్‌బ్యాంకు, ఆరోగ్య బీమా సేవలు సైతం అందుబాటులో ఉంటాయి. మనకు కావాల్సిన రకం రక్తం ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. ఇన్‌కం ట్యాక్స్, ఎన్పీఎస్ వివరాలు సైతం తెలుసుకోవచ్చు. పలు బ్యాంకుల ఖాతాదారులు తమ అకౌంట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ మీ సేవకు సంబంధించి సర్టిఫికెట్ల స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వివిధ రకాల బిల్లులను సైతం ఉమంగ్ ద్వారా చెల్లించవచ్చు.
విద్యార్థులకు సంబంధించి ఎగ్జామినేషన్ క్యాలెండర్, నోటీస్ బోర్డు (SSC), పథకాల సమాచారం, వివిధ కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు ఇందులో ఉంటాయి. పలు రకాల ఈ బుక్స్, గత సంవత్సారల ప్రశ్న పత్రాలు, ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించి సిలబస్ వివరాలు పొందవచ్చు.
Umang | డిజిలాకర్‌లో సేఫ్‌గా..
మనకు కావాల్సిన పత్రాలను డిజిలాకర్ (DigiLocker)లో సేఫ్‌గా భద్రపరుచుకోవచ్చు. అన్ని పత్రాలను వెంట తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీంట్లో పెట్టుకుంటే అవసరం అయిన చోట డిజిటల్‌గా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థుల మార్కుల మెమోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ లాంటి పత్రాలను ఇందులో భద్రపరుచుకోవచ్చు.