అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ramchandra Rao | బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (BJP state president Ramchandra Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరింత మంది కాషాయ గూటికి వస్తారని వెల్లడించారు. ఎవరెవరు, ఎప్పుడు తమ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతామని తెలిపారు. తనను కలిసిన టీవీ జర్నలిస్టులతో బీజేపీ చీఫ్ శుక్రవారం మాట్లాడారు. బీఆర్ఎస్ (BRS) నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. త్వరలోనే వారు తమ పార్టీలో చేరుతారని చెప్పారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది త్వరలో చెబుతామని, వారు మా పార్టీలో చేరే తేదీలు సైతం తెలియజేస్తామన్నారు.
Ramchandra Rao | బీఆర్ఎస్ నుంచే ఎక్కువగా..
బీఆర్ఎస్ లోని బీసీ ఎమ్మెల్యేలపై (BC MLAs) బీజేపీ ఫోకస్ చేసిందని, ఓ ముఖ్య నేత కొంత మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలకు రాంచందర్ రావు తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. త్వరలోఏ బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ (BRS party) నాయకత్వంపై నమ్మకం లేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తమ వైపు వారు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న ఆయన.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రెండ్రోజుల్లో పార్టీలో చేరుతారని చెప్పారు. బీజేపీలో చేరికలకు ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇవి మరింతగా ఉంటాయన్నారు. స్థానిక సంస్థల తర్వాత పార్టీలో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Ramchandra Rao | రాహుల్ అజ్ఞానానికి పరాకాష్ట..
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను రాంచందర్‌రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై (Election Commission) రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనానికి, అజ్ఞానానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping case) అసలు దోషులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న బీజేపీ చీఫ్.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తేనే దోషులు బయటకు వస్తారన్నారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నాటకాలాడుతోందని విమర్శించారు. ముస్లింలను మినహాయించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే తాము మద్దతునిస్తామని చెప్పారు.