అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maganti Gopinath | జూబ్లీహిల్స్ (Jubilee Hills) దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన తల్లి మహానందకుమారి (Mahananda Kumari) ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ జూన్ 8న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఆయన మరణంపై మాగంటి తల్లి, ఆయన మొదటి భార్య కుమారుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయాడో తల్లిగా తనకే తెలియదని మహానందకుమారి అన్నారు. జూన్ 5న చనిపోయాడని కొంతమంది అంటున్నారన్నారు. మరికొంత మంది 8న చనిపోయాడని చెబుతున్నారన్నారు. అయితే కేటీఆర్ (KTR) అమెరికా నుంచి వచ్చాకే గోపీనాథ్ చనిపోయాడని ప్రకటన చేశారని ఆమె తెలిపారు. తన కొడుకును ఎందుకు చూడనీయలేదని ప్రశ్నించారు.
Maganti Gopinath | ఆయన మరణం మిస్టరీ
మాగంటి మరణం మిస్టరీగా అనిపిస్తుందని ఆయన తల్లి అన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తన కుమారుడిని చూడటానికి వెళ్తే తనను, తన మరో కొడుకు వైద్యనాథ్‌ను అడ్డుకున్నారని ఆరోపించారు. సునీత తమను రాకుండా అడ్డుకుందన్నారు. ఈ మేరకు ఆస్పత్రి సిబ్బందికి ఆమె లేఖ రాశారన్నారు.
Maganti Gopinath | హడావుడిగా ఎందుకు చేశారు
మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అంత అర్జెంట్‌గా చేయాల్సిన అవసరం ఏమిటిని ఆమె ప్రశ్నించారు. ఉదయం 9 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి తీసుకెళ్లి అదే రోజు సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు ఎందుకు చేశారన్నారు. తమ బంధువులు ఆంధ్రలో ఉంటారని చెప్పారు. దూరన ఉన్న వారి కోసం ఒక్క రోజు ఎందుకు టైం ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. గోపీనాథ్‌ను చివరి చూపు చూసుకునే అవకాశం తమకు వాళ్లకు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసీస్ పేషెంట్ అయిన గోపీనాథ్ దగ్గర ఒక్క అటెండర్‌ను కూడా పెట్టకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
Maganti Gopinath | పోలీసులకు ఫిర్యాదు
గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించాలని మహానంద కుమారి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మృతిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన మరుసటి రోజే ఆమె రాయదుర్గం పోలీసు (Rayadurgam Police)లకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
