అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో మన సత్తా చాటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చాలా దాడులు చేశారు, ఇక తట్టుకోలేం ఆపండని పాక్ (Pakistan) కోరడంతోనే కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించామని ఆయన వెల్లడించారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు మంగళవారం ఆయన సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పహల్గామ్లో దాడి (Pahalgam Terror Attack)కి పాల్పడ్డారన్నారు. ఈ దాడి క్రూరత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. దేశం ఐక్యంగా నిలిచి ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టిందన్నారు. భారత దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టి 22 నిమిషాల్లో ఏప్రిల్ 22 ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాయని మోదీ తెలిపారు.
PM Modi | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని తాను హెచ్చరించినట్లు మోదీ గుర్తు చేశారు. ఈ మేరకు ఉగ్రవాదులు, వారి శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు. ఆపరేషన్ సమయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మోదీ తెలిపారు. భారత ప్రతీకార చర్య చూసి పాకిస్తాన్ బిత్తరపోయిందన్నారు. ఉగ్రవాదులు మళ్లీ కోలుకోలేని విధంగా శిక్షించినందుకు గర్విస్తున్నాని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత వాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. భారత్ సత్తా ఎవరికైతే కనిపించడం లేదో వారికి కళ్లద్దాలు కొనిస్తానని చురకలు వేశారు.
PM Modi | ఎవరు ఒత్తిడి చేయలేదు..
ఆపరేషన్ సిందూర్ ఆపమని భారత్‌పై ఏ దేశం ఒత్తిడి చేయలేదని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు (America Vice President) తనకు ఫోన్ చేశారన్నారు. పాకిస్తాన్ పెద్ద దాడి చేయబోతుందని ఆయన చెప్పారన్నారు. అయితే దాడి చేస్తే వారు చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పానన్నారు. తాము బుల్లెట్లు, బాంబులతో జవాబు చెబుతామని స్పష్టం చేశానన్నారు. పాక్ డీజీఎంవో ఫోన్ చేసి దాడులు ఆపాలని కోరడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామన్నారు.
PM Modi | మేడిన్ ఇండియా ఆయుధాలతో..
ఆపరేషన్ సిందూర్ సమయంలో మేడిన్ ఇండియా (Made in India) ఆయుధాలు కీలక పాత్ర పోషించాయని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. అనంతరం పాక్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు తెగబడిందన్నారు. అయితే భారత రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకుందన్నారు. అనంతరం పాక్ ఎయిర్‌బేస్‌లకు తీవ్ర నష్టం కలిగించామని వెల్లడించారు. దాయాదీ దేశం ఎయిర్‌బేస్‌లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు భయపడమని ఆపరేషన్ సిందూర్‌తో తేల్చి చెప్పామన్నారు. భారత్ ప్రతిస్పందన గతంలో కంటే కఠినంగా ఉందని పాకిస్తాన్ తెలిసిందన్నారు. ఏళ్ల తరబడి గుర్తుంచుకునేలా ఆ దేశానికి మన సేనలు గుణపాఠం చెప్పాయన్నారు.
PM Modi | పాకిస్తాన్ ప్రతినిధిగా కాంగ్రెస్
ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచంలో ఉన్న 193 దేశాల్లో 3 దేశాలు మాత్రమే పాక్‌కు మద్దతుగా నిలిచాయన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌ను సమర్థించిందని మోదీ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ (Congress) మాత్రం మద్దతుగా నిలవలేదని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులను అంతం చేయడం, వారి స్థావరాలను ధ్వంసం చేయడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని మోదీ తెలిపారు. ఆ లక్ష్యాలను 100 శాతం సాధించామన్నారు. అయితే కొందరు
పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకు పోతున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయ లాభం కోసం చూస్తోందన్నారు కాంగ్రెస్ మన హీరోల ధైర్యాన్ని సమర్థించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పాకిస్తాన్ ప్రచారం, కుట్రలకు ప్రతినిధిగా మారిపోయిందని విమర్శించారు.