Railway Passengers
Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​ – కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2016లో ప్రారంభమైన ఈ పనులు ఇప్పటి వరకు 50శాతమే పూర్తయ్యాయి. పనులు ఆలస్యం అవుతుండడంతో అంచనా వ్యయం భారీగా పెరిగింది.

హైదరాబాద్​ (Hyderabad) నగరం నుంచి కరీనంగర్​ జిల్లాకు కనెక్టివిటీ కల్పించడానికి ఈ రైల్వేలైన్​ నిర్మిస్తున్నారు. మెదక్​ జిల్లాలోని మనోహరాబాద్​ నుంచి గజ్వేల్​, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్​లోని కొత్తపల్లి వరకు రైల్వేలైన్​ నిర్మించాలని నిర్ణయించారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్​కు వచ్చే వారికి రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అంతేగాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న (Vemulawada Temple) దర్శనానికి వచ్చే భక్తులకు కూడా రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. ఇంత కీలకమైన రైల్వే ప్రాజెక్ట్​ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Railway Passengers | భారీగా పెరిగిన అంచనా వ్యయం

మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఉంది. 2005లోనే ఈ మార్గం కోసం సర్వే చేశారు. అప్పుడు నిర్మాణ వ్యయం రూ.800 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2015లో మరోసారి సర్వే నిర్వహించారు. భూసేకరణ, రైల్వే లైన్​ నిర్మాణానికి రూ.1,160.47 కోట్లు అవుతుందని అప్పుడు ఎస్టిమేషన్​ వేశారు. 2016లో ప్రధాని మోదీ (PM Modi) ఈ రైల్వే లైన్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టి తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు 50 శాతం పనులే పూర్తయ్యాయి. రైల్వే ట్రాక్​ 151 కిలోమీటర్ల వేయాల్సి ఉండగా.. 76 కి.మీ. మేర నిర్మాణం పూర్తయింది. అయితే తాజాగా అంచనా వ్యయం భారీగా పెరిగింది. దాదాపు 140 శాతం పెరిగి రూ.2,780.78 కోట్లకు చేరింది. తాజా అంచనా వ్యయం నివేదికను అధికారులు రైల్వేబోర్డు (Railway Board) ఆమోదం కోసం పంపించారు.

Railway Passengers | పూర్తికాని భూసేకరణ

మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్​ మార్గంలో ఇంకా భూ సేకరణ ప్రక్రియనే పూర్తి కాకపోవడం గమనార్హం. ఇంకా 99.47 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌-సిద్దిపేట-చిన్నకోడూరు వరకు భూసేకరణ అయిపోయింది. ఈ మార్గంలో రైల్వేట్రాక్‌ కూడా వేశారు. దీంతో సికింద్రాబాద్​ నుంచి సిద్దిపేట వరకు మెమూ రైలు (MEMU Train)ను దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తోంది. మిగతా పనులు పూర్తయితే.. వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్‌ వరకు రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Railway Passengers | సేకరించాల్సిన భూమి వివరాలు

ఈ రైల్వే లైన్​ మెదక్​, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్​ జిల్లా మీదుగా వెళ్తుంది. మెదక్​ జిల్లాలో మొత్తం భూసేకరణ పూర్తయింది. సిద్దిపేటలో 603.97 హెక్టార్లకు 600.65 హెక్టార్లు సేకరించారు. సిరిసిల్లలో 383.05 హెక్టార్లకు 325 హెక్టార్లు, కరీంనగర్​లో 89 హెక్టార్లకు 50.90 హెక్టార్ల భూమి సేకరించారు. మూడు జిల్లాల్లో కలిపి ఇంకా 99.47 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది.

Railway Passengers | షరతులతో అనుమతించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వేలైన్​కు షరతులతో అనుమతులు మంజూరు చేసింది. అందులో భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలి. నిర్మాణ వ్యయంలో 1/3 వంతు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. తాజాగా అంచనా వ్యయం పెరగడంతో తెలంగాణ ప్రభుత్వంపై సైతం అదనపు భారం పడనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.926.93 కోట్లకు పెరిగింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.416 కోట్లను రైల్వేశాఖ అకౌంట్​లో డిపాజిట్​ చేసింది. మరో రూ.510.93 కోట్లు సైతం డిపాజిట్​ చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.