అక్షరటుడే, వెబ్డెస్క్ : Manjeera pipeline | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మణికొండ (Manikonda)లో మంగళవారం తెల్లవారుజామున మంజీరా ప్రధాన పైప్లైన్ బ్లాస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో నీరు ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి చేరింది. జలమండలి అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు ప్రారంభించారు.
మణికొండ వద్ద ధ్వంసంసం అయిన 1200 ఎంఎం డయా గ్రావిటీ మెయిన్ పైప్ లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ (HMWS MD) అశోక్ రెడ్డి తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. పైపు లైన్ పనులు పూర్తయిన వెంటనే.. రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించాలని ఆదేశించారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేయాలని ఆదేశించారు. లీకేజీతో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు.
Manjeera pipeline | నీటి సరఫరా నిలిపివేత
ఖానాపూర్ నుంచి బోజగుట్ట వరకు వెళ్లే పైప్లైన్ మణికొండలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో పగిలినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే నీటి సరఫరాను నిలిపివేశారు. తెల్లవారుజామున 2:40 గంటలకు పైప్లైన్ పగిలిపోగా.. ఉదయం 7:00 గంటలకు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పనులు పూర్తయిన అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
పైప్లైన్ పగిలిపోవడంతో గండిపేట్, కొకాపేట్ (Kokapeta), నార్సింగి (Narsingi), మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ, షేక్పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు.. బోజగుట్ట రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.