అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ustad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మాస్ ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుండగా, రాశి ఖన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాజకీయ నేత మల్లా రెడ్డి(Malla Reddy)ని, ఈ సినిమాలో విలన్ పాత్రకు హరీష్ శంకర్ సంప్రదించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని మల్లా రెడ్డి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Ustad Bhagat Singh | అది నా వల్ల కాదు..
“హరీష్ శంకర్(Harish Shankar) మా కాలేజీకి వచ్చి నాకు ఒక గంటపాటు కథ చెప్పారు. విలన్ పాత్రకోసం రూ.3 కోట్లు ఇస్తామని అన్నారు. కానీ హీరోని తిట్టడం, కొట్టించడం నా వల్ల కాదు. అందుకే నేను ఆ ఆఫర్ తిరస్కరించాను,” అని మల్లా రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు నెటిజన్లు మల్లా రెడ్డిని తమిళ నటుడు మహేంద్రన్ (థెరి మూవీలో విలన్ పాత్ర పోషించిన)తో పోలుస్తున్నారు. అయితే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) మొదట తమిళ చిత్రం ‘థెరి’ రీమేక్‌గా ప్రకటించబడినప్పటికీ, ప్రస్తుతం ఇది పూర్తిగా ఒరిజినల్ స్క్రిప్ట్‌గా రూపొందుతోందని సమాచారం. ఇంతకుముందు గబ్బర్ సింగ్‌తో భారీ హిట్ అందించిన ఈ కాంబినేషన్, మరోసారి మాస్ మేనియాను రిపీట్ చేయనుందనే అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగా, ఈ నెలాఖరులో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లనుంది.
ఈ సినిమా విడుదల తేదీ అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పవన్ మళ్లీ తన మాస్ ఫాలోయింగ్‌కి మాంచి కిక్ ఇస్తాడా ? హరీష్ శంకర్ మళ్లీ గబ్బర్ సింగ్ మాజిక్‌ను పునరావృతం చేస్తాడా? అన్నది మరికొద్ది రోజులలో తెలియనుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో ఓజీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.