అక్షరటుడే, వెబ్డెస్క్ : Farmers Commission | రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ (Gadugu Gangadhar) అన్నారు. జాతీయ రైతు దినోత్సవం (National Farmers Day) సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
దివంగత మాజీ ప్రధాని, రైతు పక్షపాతి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా డిసెంబర్ 23న రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్ లాంటి కార్యక్రమాలతో పాటు రైతు సంక్షేమమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు.
Farmers Commission | రైతులకు అండగా కమిషన్
రైతు కమిషన్ (Farmers Commission) అన్నదాతలకు అండగా ఉంటుందని గడుగు పేర్కొన్నారు. రైతులు సమస్యలను తమ దృష్టికి తీసుకెళ్తే స్వయంగా వెళ్లి పరిష్కారానికి కృషి చేశామన్నారు. భూ సమస్యల దగ్గర నుంచి మార్కెట్ సమస్యల దాకా పలు అంశాలపై రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలను కమిషన్ అందిస్తున్నట్లు తెలిపారు. రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్లో సైతం ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందన్నారు.