అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Train Accident | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలోని జైరాంనగర్ స్టేషన్ (Jairamnagar Station) సమీపంలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
జైరాంనగర్ స్టేషన్ సమీపంలో కోర్బా ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. గెవ్రా రోడ్ నుంచి బిలాస్‌పూర్‌కు ప్రయాణిస్తున్న MEMU లోకల్ రైలు (నం. 68733) మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గటోరా, బిలాస్‌పూర్ మధ్య గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోర్బా ప్యాసింజర్ రైలు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Train Accident | రైళ్ల దారి మళ్లింపు
ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే, స్థానిక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోగీలో చిక్కుకున్న వారిని రక్షించారు. గాయాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ మార్గంలో రైలు కార్యకలాపాలు నిలిపివేశారు. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదంతో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పట్టాలపై ఉన్న బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. అయితే ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు రైల్వే అధికారులు విచారణ చేపడుతున్నారు.
