అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Mahankali Bonalu | దోమకొండ (Domakonda) మండల కేంద్రంలో ఆదివార మహంకాళీ (చాముండేశ్వరి) బోనాల (Chamundeshwari bonalu) ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. కామినేని వంశస్థులు (Kamineni descendants) 1973 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. భక్తులు బోనాలతో అధిక సంఖ్యలో తరలిరాగా, మహిళల కోసం ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Mahankali Bonalu | కామినేని వంశస్థుల ఆధ్వర్యంలో..
భక్తులు ఆలయంలో అమ్మవారికి విశేషంగా అభిషేకాలు, పూజలు చేశారు. పోతరాజులు ఘటంతో గ్రామ పోలిమేర మీదుగా డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు బావి కృష్ణమూర్తి శర్మ, శరత్ చంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
Mahankali Bonalu | అమ్మవారి దయ అందరిపై ఉండాలి.. షబ్బీర్అలీ..
ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ.. మహంకాళి అమ్మ దయ నియోజకవర్గంలోని ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు ప్రభుత్వ సలహాదారుకు అమ్మవారి చిత్రపటాన్ని అందించి సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో మహంకాళి విగ్రహం వద్ద పట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. బలి బలిదాన కార్యక్రమాలు చేపట్టారు.
Mahankali Bonalu | భవిష్యవాణి వినేందుకు..
బైండ్ల వారితో కొలుపులమ్మ భవిష్యవాణి భక్తులకు వినిపించారు. పోతురాజుల విన్యాసాలు అలరించాయి. భవిష్యవాణి వినడానికి, పోతురాజుల విన్యాసాలు చూడడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, ఈవో ప్రభు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీని సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు