అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhatti Vikramarka | మహాలక్ష్మి పథకంతో (Mahalakshmi scheme) ఆర్టీసీ మళ్లీ లాభాల బాట పట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. మహిళలకు త్వరలో మహాలక్ష్మి కార్డులు జారీ చేస్తామన్నారు.
భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో (Transport Minister Ponnam Prabhakar) కలిసి ప్రజా భవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం తెలంగాణ ఆర్టీసీని (Telangana RTC) లాభాల బాట పట్టించిందని ఆయన అన్నారు. ఈ పథకం కింద 255 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగినట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రతి మహిళకు ప్రత్యేక మహాలక్ష్మి కార్డులు జారీ చేస్తామన్నారు. దీంతో ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ వెంట పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఈ కార్డు తీసుకెళ్తే ఉచితంగా ప్రయాణం చేయొచ్చన్నారు.
Bhatti Vikramarka | 2800 ఎలక్ట్రిక్ బస్సులు
పీఎం ఇ-డ్రైవ్ పథకంలో భాగంగా హైదరాబాద్‌కు 2,800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. నిజామాబాద్, వరంగల్‌కు 100 విద్యుత్ బస్సులు మంజూరు చేస్తామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. రజక, నాయి బ్రాహ్మణుల సాంప్రదాయ వృత్తులకు ఉచిత విద్యుత్ బిల్లులను ప్రతినెలా విడుదల చేస్తామన్నారు.
ఆర్టీసీ బకాయిలు తగ్గాయని భట్టి తెలిపారు. పీఎఫ్ బకాయిలు రూ.1400 కోట్ల నుంచి రూ.660 కోట్లకు వచ్చాయన్నారు. సీసీఎస్ రూ.600 కోట్లు నుంచి రూ.373 కోట్లకు వచ్చినట్లు వెల్లడించారు. గురుకుల పాఠశాలల అద్దె, మెస్ ఛార్జీలు, ఇతర ఖర్చుల కోసం రూ.152 కోట్లు విడుదల చేశామన్నారు.