అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahabubnagar | గత కొద్ది రోజులుగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులని భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి జగన్ ట్రావెల్స్ బస్సు (Jagan Travels Bus) ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ట్యాంకర్‌లోని కెమికల్ మంటలు అంటుకునే స్వభావం లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
Mahabubnagar | డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది
చిత్తూరు నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న బస్సులో ప్రమాద సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొన్న వెంటనే ట్యాంకర్ నుంచి కెమికల్ లీకై రోడ్డుపై పడి భారీ ఎత్తున పొగలు ఎగసిపడ్డాయి. పరిస్థితిని గ్రహించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారు అత్యవసర ద్వారం సహా వివిధ దారులు గుండా కిందికి దిగి బయటపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని కెమికల్ లీకేజీ వల్ల వచ్చిన పొగలను అదుపులోకి తెచ్చారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ (Hydrochloric Acid) దహనశీలత తక్కువగా ఉండటంతో ప్రమాదం మరింత తీవ్రమవకుండా కట్టడి చేయగలిగామని అధికారులు తెలిపారు.
జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ (Jadcharla CI Kamalakar), సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. బస్సు ప్రయాణికులను మరో వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.ప్రమాదం కారణంగా NH-44పై ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో, జడ్చర్లలో మరో ప్రమాదం జరగడంతో భయాందోళన నెలకొన్నప్పటికీ, ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
