అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Monalisa Bhosle | అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ ఊహించలేరు! కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ కనిపించిన ఒక సాధారణ అమ్మాయి ఈ రోజు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరు మోనాలిసా భోంస్లే. ఆమెకి సంబంధించిన ఒక ఫోటో, ఒక వీడియో ఆమె జీవితం మొత్తం మార్చేశాయి.
ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో (Maha Kumbhamela) మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌కు చెందిన మోనాలిసా (Monalisa Bhosle) తన కుటుంబంతో కలిసి రుద్రాక్ష మాలలు, పూసలు విక్రయించింది. అయితే ఆమె అందమైన తేనెకళ్లు, అమాయకమైన చిరునవ్వు, సహజమైన వ్యక్తిత్వం చూసి అక్కడికి వచ్చిన భక్తులు, సందర్శకులు ఫిదా అయ్యారు. కొందరు ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.
ఆ వీడియోలు చూసిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా (Director Sanoj Mishra) మోనాలిసాకు తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె “ది డైరీ ఆఫ్ మణిపూర్” చిత్రంతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మోనాలిసా పేరు ఉత్తర భారతదేశంలోనే కాదు, దక్షిణ భారతదేశంలో కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడీ “పూసల అమ్మాయి” ఏకంగా పాన్ ఇండియా లెవెల్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమా పేరు “లైఫ్”. ఈ చిత్రంలో ‘క్రష్’, ‘ఇట్స్ ఓకే గురు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో చరణ్ సాయి హీరోగా నటిస్తుండగా, శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్‌పై (Sri Vengamamba Movies Banner) అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా.. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ జర్నలిస్టు, నిర్మాత సురేష్ కొండేటి కూడా మోనాలిసాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మోనాలిసా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్ లాంచ్ అయింది” అని పోస్ట్ చేశారు.
