అక్షరటుడే, వెబ్‌డెస్క్: Venezuela President | వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolás Maduro) అరెస్టు ఘటనపై అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా, దీర్ఘకాలంగా కొనసాగుతున్న దౌత్య విభేదాల పరాకాష్టగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా-వెనిజువెలా మధ్య నెలకొన్న ఉద్రిక్త సంబంధాలు, ప్రొవొకేషన్స్ చివరకు ఈ పరిణామానికి దారి తీశాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, రాజకీయ ఒత్తిడిని మదురో ప్రభుత్వం గత కొన్నేళ్లుగా బహిరంగంగానే ఖండిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం మదురోకు పదవి వీడి దేశం విడిచిపోవాలంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు కథనాలు వచ్చాయి.
Venezuela President | డ్యాన్స్ కొంపముచిందా?
అయితే మదురో మాత్రం ఆ సూచనలను పట్టించుకోకుండా, ప్రభుత్వ మీడియా ద్వారా తనకు ప్రజల మద్దతు ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ప్రయత్నించారు. ఇటీవల వెనిజువెలా ప్రభుత్వ టెలివిజన్‌లో మదురో తరచూ ఉత్సాహంగా కనిపించడం, వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం అమెరికా వర్గాలకు సంకేతాత్మకంగా తప్పు సందేశం ఇచ్చిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. “నో క్రేజీ వార్” అనే పాటకు మదురో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా, దీనిని అమెరికా తీవ్ర అవమానంగా భావించిందని, “ఆయన చేసిన ఒక డ్యాన్సే కొంపముంచిందని ,ఇది అమెరికా హెచ్చరికలను లెక్కచేయడం లేదన్న భావనకు దారితీసిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది. ఈ చర్యలు వైట్ హౌస్ (White House)లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయని ఆ కథనం వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే అమెరికా తన వ్యూహాన్ని మరింత కఠినంగా మార్చినట్లు సమాచారం. ఈ నెల 3న తెల్లవారుజామున కరాకస్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన అమెరికా బలగాలు, మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత వారిని న్యూయార్క్ (New York)కు తరలించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో మదురో దంపతులు నిర్బంధంలో ఉన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల సరఫరా ఆరోపణలపై వారు కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ఈ ఆరోపణలను వారు ఖండించారు. కేసు తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి అల్విన్ కె. హెల్లర్‌స్టీన్ వెల్లడించారు.