అక్షరటుడే, వెబ్డెస్క్ : Madras High Court | భార్యభర్తల మధ్య విడాకుల కేసుల నేపథ్యంలో భరణం చెల్లింపు అంశంపై మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త కంటే భార్యకు ఎక్కువ ఆదాయం ఉంటే ఆమెకు భరణం చెల్లించాల్సిన(Alimony Payment) అవసరం లేదని స్పష్టం చేస్తూ, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది.
ఈ తీర్పు విడాకుల నేపథ్యంలో ఉన్న దంపతులకు దిశానిర్దేశకంగా మారింది. చెన్నై(Chennai)కి చెందిన వైద్య దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో, వారు విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం భర్త తన భార్యకు నెలకు రూ.30,000 చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించింది కోర్టు. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ భర్త మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
Madras High Court | హైకోర్టు పరిశీలనలో ఆసక్తికర విషయాలు
విచారణ సందర్భంగా పిటిషనర్ (భర్త) తన భార్యకు ఇప్పటికే అధిక ఆస్తులు, స్థిర ఆదాయం ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఆమె స్వంతంగా స్కానింగ్ సెంటర్(Scanning Center) నడుపుతోందని, అధిక ఆదాయ వనరులు ఉన్నాయని పత్రాలను సమర్పించారు. అలాగే, కొడుకు నీట్ పరీక్ష కోసం అవసరమైన రూ.2.77 లక్షలు ఇవ్వడానికి తాను సన్నద్ధంగా ఉన్నట్టు కూడా పిటిషనర్ తెలిపాడు. అయితే, చదువుతో సంబంధం ఉన్న అంశాల్లో కోర్టు జోక్యం చేసుకోదని హైకోర్టు(Madras High Court) స్పష్టం చేసింది.ఈ అంశాలన్నింటిని పరిశీలించిన మద్రాసు హైకోర్టు, భర్త కంటే భార్యకు అధిక ఆదాయం ఉంటే ఆమెకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
దీంతో పాటు ఫ్యామిలీ కోర్టు(Family Court) జారీ చేసిన నెలకు రూ.30,000 భరణం చెల్లించాలన్న ఆదేశాలను రద్దు చేసింది. ఈ తీర్పు, భరణం విషయంలో లింగ సమానత్వానికి న్యాయ సంబంధంగా కొత్త ఆమోదం లభించినట్టుగా భావించవచ్చు. భార్యను కేవలం మహిళ అన్న కారణంతో భరణం ఇవ్వాలన్న దానికంటే, వాస్తవిక ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తీర్పు రావాలనే కోర్టు దృష్టికోణం ఇక్కడ స్పష్టమైంది. ఈ తీర్పు భవిష్యత్తులో పలు విడాకుల కేసులకు ప్రామాణికంగా మారే అవకాశముంది.