అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet Expansion | రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)కు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు కొత్త మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీలో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. దీంతో గవర్నర్(Governer) శనివారం రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్‌కు బయలు దేరనున్నారు. ఆయన కార్యాలయం నుంచి సమ్మతి రాగానే రేపే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఇంకా గవర్నర్ అనుమతి రావాల్సి ఉంది.
కాగా.. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై ఆశావహులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. పదవి కోసం చివరి వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు శనివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. ఇటీవలే వీరు హైకమాండ్‌తో కూడా భేటీ అయిన విషయం తెలిసిందే. అక్కడ చర్చించిన అంశాలను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.
ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్లో ఒక చోటు ఉంటుంది.. అందుబాటులో ఉండాలని సీఎం సూచించినట్లు సమాచారం. అయితే ఇందులో ఎవరికి పదవి ఇస్తారోననే ఉత్కంఠ నెలకొంది. అదే జరిగితే ఎస్సీ కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మాల సామాజిక వర్గానికి చెందిన వారి ఆశలు గల్లంతు కానున్నాయి.
Cabinet Expansion | ఎవరిని తొలగిస్తారు
రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం మూడు ఖాళీలున్నాయి. కొత్తగా మూడు మంత్రి పదవులను భర్తీ చేయడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఇద్దరిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరిని తొలగిస్తారనే ఉత్కంఠ నెలకొంది. గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఓ మహిళా మంత్రిని, వెల్మ సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రికి ఉద్వాసన తప్పదని సమాచారం. సామాజిక వర్గాల కూర్పు ఆధారంగా మంత్రి పదవులు భర్తీ చేయడానికి అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ నియామకం కూడా పూర్తి చేయాలని యోచిస్తోంది.