అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madhya Pradesh | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ (Jitu Patwari) ఇంట్లో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఇండోర్ నగరంలోని (Indore City) రాజేంద్రనగర్ జిజల్‌పూర్‌లో ఉన్న ఆయన నివాసంలోకి దొంగలు చొరబడి రెండు గంటల పాటు హల్‌చల్ చేశారు.
ముఠాలో అరడజనుకిపైగా దొంగలు ఉండగా, వారు మాస్కులు ధరించి ముఖాలను కప్పుకున్నారు. దొంగలు ముందుగా ఆ ప్రాంతానికి కరెంట్ సరఫరా నిలిపివేశారు. అనంతరం పట్వారీ ఇంటి సీసీ కెమెరాలను (CCTV cameras) ధ్వంసం చేసి, లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని ఆఫీస్‌లో ఉన్న డ్రాయర్లు, లాకర్లను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అయితే విలువైన మొబైళ్లు, పలు ఖరీదైన వస్తువులను వదిలేసి మిగిలిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లడం అనుమానాలకు దారి తీస్తోంది.
Madhya Pradesh | ఇతర ప్రముఖుల ఇళ్లలోకి..
పట్వారీ ఇంటితో పాటు, సమీపంలోని చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ (CMO) రాజ్‌కుమార్ ఠాకూర్ మరియు మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (MPEB) అధికారి నరేంద్ర దూబే ఇళ్లలోకి కూడా చొరబడ్డారు. దొంగలు మరో మూడు ఇళ్ల కిటికీల మెష్‌లు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. దొంగలు దాదాపు రెండు గంటల 30 నిమిషాల పాటు ఆ ప్రాంతంలో హల్‌చల్ చేశారు. ఇంట్లో కెమెరాలను ధ్వంసం చేసినా, వెలుపల ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో దొంగలు మాస్కులతో ఉన్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలు సేకరిస్తూ, దొంగల ముఠాను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనా నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నాయకుల ఇళ్లే ఇలా టార్గెట్ అవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దొంగతనానికి రాజకీయ కోణం ఉందా? లేక సాదా చోరీనా? అనే కోణంలో కూడా పోలీసులు (Police) విచారణ జరుపుతున్నారు.