అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను పరామర్శించకపోవడం సరికాదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కి గౌడ్ అన్నారు.
కామారెడ్డి (Kamareddy), ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గాల్లో ఆదివారం (సెప్టెంబరు 7) ఆయన వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు.
రాజంపేట మండలం గుండారం, ఎల్లాపూర్ తండా, నడిమి తండా, పలుగుట్ట తండాలలో పర్యటించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తండాలలో నివసించే గిరిజనులతో మాట్లాడి వరదల floods వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోవడం, పశువులు కొట్టుకుపోవడం తెలుసుకుని చలించిపోయారు.
ఇళ్లు, రోడ్లు, కరెంట్ వ్యవస్థ దెబ్బతిన్న తీరును తెలుసుకొని బాధితులకు ధైర్యం చెప్పారు. విద్యుత్తు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, తండాలకు విద్యుత్తు సదుపాయాన్ని పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.
Madhuyaski Goud : బాధితులకు దుస్తుల పంపిణీ..
ఈ సందర్భంగా శేషాద్రి ఇండస్ట్రీ సహకారంతో ఆయా వరద బాధిత తండాల ప్రజలకు వస్త్రాలు పంపిణీ చేశారు. కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట బస్తీలోనూ బాధితులను పరామర్శించారు.
బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధుయాస్కీ మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందించేలా కృషి చేస్తామన్నారు.
స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బాధిత ప్రాంతాలను సందర్శించారని గుర్తుచేశారు.
నష్టపరిహారం అందించే విషయంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించారని మధుయాస్కి పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో వరదలు వచ్చి ప్రజాజీవనం అల్లకల్లోలం అయిందన్నారు.
అయినప్పటికీ పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్.. కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినా కనీసం ప్రజలను పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు.