అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madanapalle Murder Case | అన్నమయ్య జిల్లా (Annamaya District)లోని మదనపల్లెలో ఇటీవల జరిగిన బాలికపై అత్యాచారం, హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురవడం స్థానికులను కుదిపేసింది.
ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే అతడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం మరింత కలకలం రేపింది. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు చేసేందుకు అతడి తల్లి, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. చివరిచూపు కూడా చూడడానికి నిరాకరించారు. మృతదేహాన్ని తీసుకెళ్లమని పోలీసులకు తెలియజేశారు.దీంతో మున్సిపల్ సిబ్బంది (Municipal Staff) కులవర్ధన్ మృతదేహాన్ని చెత్త తరలించే వాహనంలో శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Madanapalle Murder Case | ఘటన వివరాలు..
నీరుగట్టువారిపల్లె (Neerugattuvaripalle) ప్రాంతంలో పవర్లూమ్ రంగంలో పనిచేస్తున్న కులవర్ధన్పై కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లిన బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకోగా తలుపులు లోపల నుంచి బిగించబడి ఉండటంతో గడియ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని ఓ డ్రమ్ములో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణలో లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, విద్యార్థులు, మహిళా సంఘాలు నిరసనలు చేపట్టారు.
కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ (DIG Koya Praveen) పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ఇది లైంగిక దాడి, హత్య కేసు అని ప్రకటించారు. అయితే నిందితుడు కులవర్ధన్‌ను రక్షణ వాహనంలో తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయి సమీప చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ ధీరజ్ (SP Dheeraj) తెలిపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ ఘటనతో మదనపల్లె ప్రాంతంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చిన్నారిపై జరిగిన దారుణానికి ప్రజలు తీవ్రంగా స్పందించారు. నిందితుడి మృతితో కొంతమంది స్థానికులు సంబరాలు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది.