అక్షరటుడే, వెబ్డెస్క్ : Madanapalle minor murder | ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన చిన్నారి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మదనపల్లె (Madanapalle ) ప్రాంతంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడైన కులవర్ధన్ (Kulavardhan) ఆత్మహత్య చేసుకున్నాడు.
అన్నమయ్య జిల్లా (Annamayya District) మదనపల్లిలో ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె మృతదేహాన్ని నిందితుడు డ్రమ్ములో పెట్టాడు. ఈ ఘటనపై మంగళవారం మదనపల్లిలో ప్రజలు ఆందోళన చేశారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అతడి మృతదేహాన్ని కురబలకోట మండలం కనసానివారిపల్లె సమీపంలోని చెరువులో గుర్తించారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Madanapalle minor murder | చంద్రబాబు సీరియస్..
ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. చిన్నారి కనిపించకుండా పోయిన తర్వాత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, నిందితుడు బాలికను మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం డ్రమ్ములో నీటిలో ముంచి హత్య చేసినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) సీరియస్గా స్పందించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన సమయంలోనే అతడు చెరువులో మృతదేహంగా లభ్యమవడం కేసులో కొత్త మలుపు తిప్పింది.
ప్రస్తుతం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు.