అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dubai | సాధారణంగా మన పరిసర ప్రాంతాలలో ఏదైన వస్తువు పోగొట్టుకుంటే అది దొరకడం అనేది చాలా కష్టం. అయితే విదేశాల్లో విలువైన వస్తువులు పోయినప్పుడు అవి తిరిగి దొరకడం చాలా అరుదైన విషయమే.
అయితే, ప్రముఖ తమిళ యూట్యూబర్(Tamil YouTuber) మదన్ గౌరికి దుబాయ్‌లో జరిగిన అనుభవం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Dubai International Airport)లో పోగొట్టుకున్న తన మొబైల్ ఫోన్‌ను, అక్కడి పోలీసులు ఎంతో సేవాభావంతో చెన్నైకి పంపించి వారి నిజాయితీని మరోసారి నిరూపించారు.
Dubai | అదృష్టమే..
వివరాల్లోకి వెళితే… మదన్ గౌరి ఇటీవలే దుబాయ్‌కు వెళ్లి వచ్చాడు. తిరుగు ప్రయాణం సమయంలో, దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో తన స్మార్ట్‌ఫోన్(Smart Phone)ను పోగొట్టుకున్నాడు. వెంటనే విమానాశ్రయ సిబ్బందిని సంప్రదించగా, వారు ఫోన్ వివరాలతో ఈమెయిల్ పంపమని సూచించారు. అయితే ఫోన్ దొరుకుతుందిలే అనే ఆశ పెట్టుకోకుండానే మదన్ గౌరి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. కొద్ది రోజులకే అతడికి దుబాయ్ పోలీసులు(Dubai Police) నుంచి ఓ ఈమెయిల్ వచ్చింది. అందులో, అతడి ఫోన్ దొరికిందని, దానిని తిరిగి పంపే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. మదన్ గౌరి షాక్‌కి గురయ్యాడు. అంతటితో ఆగకుండా, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్(Emirates Airlines) సిబ్బంది సహకారంతో ఆ ఫోన్‌ను తదుపరి ఫ్లైట్‌లో ఉచితంగా చెన్నైకి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ అనూహ్య సంఘటనను మదన్ గౌరి సెప్టెంబర్ 2న తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పంచుకున్నాడు. తన మొబైల్ తిరిగి వచ్చిందని, దుబాయ్ పోలీసులు, ఎయిర్‌లైన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగంగా స్పందించాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 27 లక్షలకు పైగా వ్యూస్, 2 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. ఈ క్రమంలో దుబాయ్ పోలీసుల పని తీరును నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం దుబాయ్ అని, “దుబాయ్ పోలీసులు ఎప్పుడూ అత్యుత్తమ సేవలే ఇస్తారు అంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.అయితే, “ఇది చాలా విమానయాన సంస్థలు పాటించే సాధారణ ప్రోటోకాల్” అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.