అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. పోలీసులు తనిఖీలు చేపడుతున్నా దందా మాత్రం ఆగడం లేదు.
దేశంలోని పలు ప్రాంతాల నుంచి డ్రగ్స్, గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. తాజాగా కొంపల్లిలో డ్రగ్స్ దందా చేపడుతున్న ఓ నైజీరియన్ వ్యక్తిని (Nigerian man) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నాలుగేళ్లుగా దందా చేస్తున్న పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. ప్రేమ పేరుతో యువతులకు వల వేసి వారితో డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నాడు.
Hyderabad | ఏజెంట్లుగా యువతులు
నిందితుడు ప్రేమ, సహజీవనం పేరుతో యువతులకు దగ్గరయ్యే వాడు. అనంతరం వారిని ఏజెంట్లుగా మార్చి డ్రగ్స్ దందా చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని తాజాగా నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (Narcotics Enforcement Bureau)(HNEW) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు నైజీరియా నుంచి విద్యార్థి వీసా మీద భారత్‌కు వచ్చాడు. ఇక్కడ డ్రగ్స్ దందా చేస్తున్నాడు. పోలీసులకు దొరక్కుండా మూడు నెలలకు ఒకసారి నగరాలు మార్చేవాడు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, గోవాలో ఐదు ఇళ్లను అద్దెకు తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఏడుగురు యువతులతో అతడు సహజీవనం చేశాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులకు ఉచితంగా మత్తు పదార్థాలు అందించేవాడు. వారితో దందా చేయించేవాడు.
Hyderabad | కోడ్ భాషలో..
డ్రగ్స్ దందా కోసం నిందితుడు కోడ్ భాషను వినియోగించేవాడు. మాల్ కావాలంటే (???) మూడు ప్రశ్నార్థకాలు పంపేవాడు. డ్రగ్స్ రెడీ అయితే మూడు చుక్కలు (…) పంపేవాడు. అన్ని రకాల డ్రగ్స్‌కు కామన్ కోడ్‌గా స్కోర్ అని వాడేవాడు. మామ స్కోర్ చేశావా అంటూ ఆర్డర్లు తీసుకునేవాడు. నిందితుడు కొంపల్లికి చెందిన యువతికి సైతం ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అనంతరం ఆమె ద్వారా నగరంలోని పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. యువతి ఇంట్లోనే మాదకద్రవ్యాలు నిల్వ చేసేవాడు. సదరు యువతి ద్వారా పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.