అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీ మరోసారి పేలుడు చేసుకుంది. మహిపాల్‌పూర్‌లోని (Mahipalpur) రాడిసన్ హోటల్ సమీపంలో ఈ ఉదయం భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో మహిపాల్‌పూర్‌లోని రాడిసన్ హోటల్ (Radisson Hotel) దగ్గర ఉదయం పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. ఉదయం 9:18 గంటలకు కాల్ అందినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు (Fire Department Officers) తెలిపారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని తెలిపారు. పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవని చెప్పారు. ఘటన స్థలంలో ఎలాంటి పేలుడు జరగలేదని, నష్టం కలగలేదని, అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని స్పష్టం చేశారు.
Delhi Blast | బస్సు టైర్!
పోలీసుల విచారణ తర్వాత, ధౌలా కువాన్ వైపు వెళ్తున్న డీటీసీ బస్సు వెనుక టైర్ నుంచి పెద్ద శబ్దం వచ్చిందని, అది పగిలిపోయిందని ఒక భద్రతా గార్డు చెప్పాడు. ఇప్పుడు పరిస్థితి సాధారణంగా కనిపిస్తోంది. అయితే, పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రాథమిక దర్యాప్తులో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సౌత్ వెస్ట్ డీసీపీ (South West DCP) తెలిపారు. శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇక ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు (Blast) ఘటన దేశం యావత్తూ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని (DNA) పరీక్ష ద్వారా నిర్ధారించారు. ఈ పేలుడులో 12 మంది మరణించగా.. 20మందికిపైగా గాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తల్లి DNA నమూనాలను, పేలుడు జరిగిన ప్రదేశం నుంచి, ముఖ్యంగా కారు నుంచి స్వాధీనం చేసుకొని పరిశీలించగా అవి పూర్తిగా సరిపోవడంతో నిందితుడు అతనేనని నిర్ధారించారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.
