అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హవా కొనసాగిస్తే తెలంగాణలో (Telangana) జరిగిన ఏకైక ఉప ఎన్నికలో కమలం పార్టీ కకావికలమైంది.
రాష్ట్రంలో పార్టీ స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ చేజేతులా జారవిడుచుకుంది. వ్యూహాత్మక తప్పిదాలతో ప్రతిష్టాత్మక పోరులో భారీ ఓటమిని మూటగట్టుకుంది. గతంలో జరిగిన హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించిన కాషాయ దళం.. తాజా ఉప ఎన్నికలో (Jubilee Hills by-Election) మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా తెలంగాణలో అధికారం సాధించాలన్న కలలకు జూబ్లీహిల్స్‌లో ఓటమి రూపంలో గండిపడింది.
Jubilee Hills by-Election | తొలి నుంచి తప్పిదాలే..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు బీజేపీ (BJP)కి మంచి అవకాశం లభించింది. కానీ, ఆ పార్టీ స్వయంకృతాపరాధంతో పోటీలో లేకుండా పోయింది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ దూసుకుపోగా, బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం నుంచి పోల్ మేనేజ్‌మెంట్ వరకూ అన్నింట్లోనూ జరిగిన తప్పిదాలు పార్టీని నిండా ముంచాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంతో హోరెత్తించగా బీజేపీ మాత్రం ఆలస్యంగా మేల్కొంది. అందరికంటే చివరిగా అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక ప్రచారంలోనూ అలాగే వ్యవహరించింది. ఒక్క భారీ బహిరంగ సభ కూడా నిర్వహించలేదు. కేవలం కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలకే పరిమితమైంది.
Jubilee Hills by-Election | కొరవడిన సమన్వయం..
ఉప ఎన్నికలో గెలవాలన్న కసి పార్టీ ముఖ్య నేతల్లో కనిపించకుండా పోయింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించి, సమన్వయం చేసే వారే లేకుండా పోయారు. పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో రాంచందర్‌రావు ఘోరంగా విఫలమయ్యారు. నేతలు, క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం చేయడంలో వెనుకబడ్డారు. తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) లైట్‌గా తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని (Bandi Sanjay) పార్టీ సరైన విధంగా వినియోగించుకోలేక పోయింది. మొదటి నుంచి ఆయనతో ప్రచారం చేయించకుండా రెండు, మూడు రోజుల ముందు మాత్రమే రంగంలోకి దించింది. అప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ దూసుకుపోవడంతో బీజేపీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వకుండా పోయింది.
Jubilee Hills by-Election | బయటపడిన విభేదాలు
రాష్ట్ర బీజేపీలో నెలకొన్న విభేదాలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బహిర్గతమైంది. ఇక, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలాకాలంగా బీజేపీలో అంతర్గత పోరు కొనసాగుతోంది. అధ్యక్షుడి ఎన్నిక నుంచి మొదలు తాజా ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక వరకూ పలుమార్లు విభేదాలు బయటపడ్డాయి. లంకల దీపక్‌రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కొంత మంది ముఖ్యనేతలు బహిర్గతంగానే తప్పుబట్టారు. దీంతో అలాంటి నేతలు ఎన్నికల వేళ అంటీముట్టనట్లు వ్యవహరించారు. మాస్ ఇమేజ్ కలిగి ఉన్న ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) లాంటి వారు అటువైపు కన్నెత్తి చూడలేదు. మొత్తంగా బీజేపీ చేసిన తప్పిదాలు ఆ పార్టీని భారీ ఓటమి వైపు నెట్టేశాయి.
