అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాజకీయ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కలెక్టర్ చిరంజీవులు (former Collector Chiranjeevulu) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఈ నెల 15న బీసీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడంతో పాటు ఇతర హామీలను కూడా ఇచ్చిందన్నారు. ఆ హామీల అమలు ఎందుకు చేయలేకపోతున్నారో సదస్సు ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొడంగల్లో ముగింపు సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్లో (Hyderabad) భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Kamareddy | ఏ పార్టీకి సంబంధం లేదు..
రిజర్వేషన్ సాధన సమితి ఏ రాజకీయ పార్టీకి (Political Party) చెందినది కాదని చిరంజీవులు స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ పార్టీలకు స్థానం లేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలుతో 25 వేల మంది రాజకీయాల్లోకి వస్తారని బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పేర్కొందని చెప్పారు. కులగణన చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, బీసీ సంఘాల ఒత్తిడి మేరకే ప్రభుత్వం కులగణన చేపట్టింది తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తమిళనాడులో (tamil nadu) ఏ విధంగా అయితే రిజర్వేషన్ అమలు చేస్తున్నారో.. అదే విధానాన్ని ఇక్కడ అవలంబించాలని తాము మొదటి నుంచి చెబితే ఇప్పటివరకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదన్నారు.
కాళేశ్వరం మీద ఆఘమేఘాల మీద అఖిల పక్షం నిర్వహించారని, కానీ బీసీల కోసం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలకు చెప్పి చైతన్యం చేసేందుకే సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఛైర్మన్ విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్, బీసీ సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, గౌడ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, గౌడ సమన్వయ కమిటీ కన్వీనర్ నారాయణ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
