అక్షరటుడే, వెబ్డెస్క్:MLC Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒంటరయ్యారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఆమెకు తోడుగా నిలిచే వారు కరువయ్యారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె కుటుంబం తరఫున కానీ, పార్టీ తరఫున కానీ ఖండించే వారే లేకుండా పోయాయిరు.
మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ బిడ్డ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Chief KCR)కు రహస్యంగా రాసిన లేఖ బహిర్గతం కావడం, తదనంతర పరిణామాల తర్వాత కవిత పార్టీ ముఖ్యులపై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ దేవుడంటూనే, ఆయన పక్కన దెయ్యాలు ఉన్నాయని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే అటు కుటుంబ పరంగా, ఇటు పార్టీ పరంగా కవితను దూరం పెట్టడం ప్రారంభమైంది.
MLC Kavitha | అప్రకటిత బహిష్కరణ..
చాలా కాలంగా బీఆర్ఎస్లో అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్య నేతల మధ్య మొదలైన కూడా విభేదాలు అధికారం నుంచి దిగిపోయాక మరింత తీవ్రమయ్యాయి. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కవిత ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయింది. ఆమె జిల్లాల పర్యటనపై ఆంక్షలు మొదలయ్యాయి. ఎప్పుడైతే మద్యం కేసులో కవిత అరెస్టు అయ్యారో అప్పటి నుంచి ఆమె విషయంలో పార్టీ వైఖరి పూర్తిగా మారిపోయింది. ఆమెను ఒంటరి చేయడం మొదలైంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Silver Jubilee) సభ నిర్వహణ, పాజిటివ్, నెగెటివ్ అంశాలతో కవిత తన తండ్రికి రాసిన లేఖ అనూహ్యంగా బయటకు రావడంతో పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఈ వ్యవహారంపై ఆమె బహిరంగంగా పార్టీ ముఖ్యులపై విమర్శలు ఎక్కుపెట్టారు. తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడిని, మిగతా వారికి ఎవరికీ నాయకత్వ లక్షణాలు లేవని వ్యాఖ్యానించారు.
అంతకు ముందు బీసీలకు న్యాయం చేయలేదని, సామాజిక తెలంగాణ (Telangana) సాధించుకోలేక పోయామని ఓ రకంగా కేసీఆర్ పాలనను ఆక్షేపించారు. ఎప్పుడైతే కవిత పార్టీపై విమర్శలు చేయడం, తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)ని క్రియాశీలం చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచే ఆమెను బీఆర్ ఎస్ దూరం పెట్టేసింది. ఒక రకంగా ఆమెపై అప్రకటిత బహిష్కరణ కొనసాగుతోంది.
MLC Kavitha | అండగా నిలువని కుటుంబం..
బీఆర్ఎస్‌కు, ఆమెకు దూరం పెరిగినప్పటికీ, కుటుంబ నుంచి కూడా మద్దతు లేకుండా పోయింది. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలోనే చీలికలు వచ్చాయి. కుమారుడు కేటీఆర్(KTR), కూతురు కవిత మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే, ఈ మధ్య బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తున్న కవిత పట్ల తీన్మార్ మల్లన్న అలియస్ చింతపండు నవీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల అర్థమేదైనా, సామెతలు ఏ పరమార్థం చెబుతున్నా ఓ మహిళ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా గర్హనీయమే. ఆయన వ్యాఖ్యలపై సహజంగానే విమర్శలు వెల్లువెత్తాయి.
మల్లన్నకు చెందిన క్యూ న్యూస్(Q News)పై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ తరుణంలో అనుచిత వ్యాఖ్యలతో ఆవేదనకు గురైన కవితకు బీఆర్ఎస్ నుంచి మద్దతు లేకుండా పోయింది సరే, కానీ సొంత కుటుంబం నుంచి కూడా ఆమెకు సాంత్వన లభించక పోవడం చర్చనీయాంశమైంది. పార్టీ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ గులాబీ నాయకత్వం అండగా ఉండాల్సింది పోయి పట్టించుకోనట్లు వ్యవహరించింది. ఇక కుటుంబం నుంచి కూడా మద్దతు లేకుండా పోవడంతో కవిత ఒంటరయ్యారన్న భావన వ్యక్తమవుతోంది.