అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒంటరయ్యారు. పార్టీ నుంచే కాదు, సొంత కుటుంబం నుంచి కూడా మద్దతు కరువైంది.
ఆమె తన తండ్రి కేసీఆర్(KCR)కు రాసిన లేఖ బయటకు వచ్చినప్పటి నుంచి మొదలు తాజాగా హరీశ్‌రావు, సంతోష్‌రావుపై చేసిన వ్యాఖ్యల వరకు కవితకు ఇటు పార్టీ నుంచే కాదు, సొంత కుటుంబం నుంచి అండగా నిలిచే వారే లేకుండా పోయారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే కాదు, కేడర్ కూడా దూరంగా ఉంటున్న తరుణంలో ఆమె ఒంటరిగా మారారు.
MLC Kavitha | ఎప్పటి నుంచో దూరం..
వాస్తవానికి చాలా కాలం క్రితం నుంచే కవితకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి, కవిత ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. మద్యం కేసులో అరెస్టయిన తర్వాత ఆమెను దాదాపు పక్కన పెట్టేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, జిల్లాల్లో పర్యటనలు చేయకుండా ఆంక్షలు విధించారు. పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా చేశారు. ఇదే విషయాన్ని కవిత కూడా పలుమార్లు వెల్లడించారు. కనీసం తన సొంత జిల్లా నిజామాబాద్(Nizamabad)కు కూడా నిధులు తెచ్చుకోలేని దుస్థితిని ఎదుర్కొన్నానని చెప్పారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని వెల్లడించడం ద్వారా ఆమె బీఆర్ఎస్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను అర్థం చేసుకోవచ్చు.
MLC Kavitha | ధిక్కార స్వరం..
జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవిత(MLC Kavitha) కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కక పోవడంతో ఒంటరి ప్రయాణం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం చేసేలా వ్యాఖ్యలు చేయడం గులాబీ పార్టీలో కలకలం రేపింది. పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటూ ఆమె విమర్శలు చేయడం ప్రత్యర్థులకు మరింత అవకాశంగా మారింది. కేసీఆర్ దేవుడంటూనే ఆయన పక్కన దెయ్యాలున్నాయని, వారి వల్లే పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు. మరోవైపు, వరుసగా పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని లిల్లిపుట్ నాయకుడని విమర్శించారు. కేసీఆర్ ఒక్కడే తనకు నాయకుడని, మిగతా వారికి పార్టీని నడిపే నాయకత్వ లక్షణాలు లేవని కేటీఆర్(KTR)పైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాజాగా హరీశ్‌రావు, సంతోష్‌రావును లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే కవిత పార్టీపై ధిక్కార స్వరం మొదలు పెట్టినప్పటి నుంచి గులాబీ బాస్ ఆమెను దూరం పెడుతూ వచ్చారు. దీంతో కీలక నేతలు సైతం ఆమె వెంట నడవడం మానేశారు.
MLC Kavitha | దూరం పెట్టిన కేసీఆర్..
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబంలో చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. కవిత అరెస్టయిన తర్వాత ఎప్పుడైతే కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత చేసిన దెయ్యాలు అనే వ్యాఖ్యలు గులాబీ శ్రుణులను గందరగోళంలో పడేశాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కవితను దూరం పెట్టారు. ఆమెను కలిసేందుకు సైతం విముఖత చూపలేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో కవిత వెళ్లగా, లోనికి రానివ్వలేదు. మరోవైపు, కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ఎదుట విచారణకు వెళ్తున్న సమయంలో కవిత ఫామ్‌హౌస్‌కు వెళ్లగా, అప్పుడు కూడా కేసీఆర్ ఆమెను పలుకరించలేదు. ఇక, తన కుమారుడు విదేశాలకు వెళ్తున్న సమయంలో కేసీఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు ఫామ్‌హౌస్‌కు వెళ్లినప్పుడు కూడా తన కూతుర్ని కలిసేందుకు అనుమతించలేదు. కనీసం ముఖం కూడా చూపించలేదు. ఎప్పటి నుంచో కవిత మీద గుర్రుగా ఉన్న కేసీఆర్.. హరీశ్‌రావు(Harish Rao), సంతోష్ రావు(Santosh Rao)పై ఆమె చేసిన తాజా వ్యాఖ్యలతో సీరియస్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
MLC Kavitha | కుటుంబం కూడా..
బీఆర్ఎస్ పార్టీ(BRS Party)తో పొటు సొంత కుటుంబం నుంచి కూడా కవితకు మద్దతు కరువైంది. ముఖ్య నేతలతో పాటు నేరుగా కేటీఆర్‌పైనా విమర్శలు ఎక్కుపెట్టడంతో ఆమెకు కల్వకుంట్ల ఫ్యామిలీ దూరమైంది. అన్నా చెల్లి మధ్య ఎప్పటి నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా ఇది ప్రస్ఫుటంగా బయటపడింది. రాఖీ కట్టేందుకు ఇంటికి వస్తానని కవిత మెసేజ్ చేయగా, కేటీఆర్ అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత తీరిగ్గా తాను అందుబాటులో లేనని, బెంగళూరు వెళ్తున్నానని బదులివ్వడం అన్నాచెల్లి మధ్య దూరం పెరిగిందనడాకి నిదర్శనంగా నిలిచింది. తండ్రిని దేవుడంటూనే మిగతా వారిపై విమర్శలు చేస్తుండడంతో గులాబీ పార్టీతో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా ఆమెను దూరం పెడుతోంది. దీంతో కవిత ఒంటరిగా మారారు.