అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల జీవో చెల్లుబాటుపై హైకోర్టు రెండ్రోజుల్లో తేల్చనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే అందరి దృష్టి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల జీవో జారీ చేసింది.
అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు(Supreme Court) మార్గదర్శకాల నేపథ్యంలో జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 8న మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపైనే అందరి దృష్టి నెలకొంది. మరోవైపు, ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతాయా లేక వాయిదా పడుతాయా? అన్న సందిగ్ధం ఏర్పడింది.
Local Body Elections | విడుదలైన షెడ్యూల్..
సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరోవైపు, ఓటరు జాబితాలు సిద్ధం చేసిన ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. తొలి రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు, మూడు విడుతల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. అయితే, నోటిఫికేషన్ విడుదలకు ముందు రోజే అంటే అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు బీసీ రిజర్వేషన్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించనుంది.
Local Body Elections | తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..
మరోవైపు, బీసీ రిజర్వేషన్ల(BC Reservations) జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న తరుణంలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. జీవో చట్టబద్ధతను సవాలు చేస్తూ వంగా గోపాల్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అయితే, రాష్ట్ర హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం(State Government) తరపు సీనియర్ న్యాయవాదులు తెలిపారు.
హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున… విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ న్యాయవాదిని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టికల్ 32 కింది దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని అడిగింది. అయితే, హైకోర్టు(High Court) స్టే ఇవ్వలేదని, అందుకే సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా, ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వస్తారా? అని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
Local Body Elections | జీవో కొట్టివేస్తే..
సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టుపైనే నెలకొంది. జీవోకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందా? లేక రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు కొట్టి వేస్తుందన్న అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కోర్టు జీవోను కొట్టివేస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏం జరిగినా అది అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందన్న వాదన వినిపిస్తోంది.
ఇచ్చిన మాట ప్రకారం తాము 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని ప్రయత్నాలు చేశామని, కానీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం, జీవోను కోర్టు కొట్టివేసిందని ప్రజల్లో ప్రచారం చేసుకోనుంది. ఒకవేళ జీవోను కోర్టు సమర్థిస్తే ఇచ్చన మాటను నిలబెట్టుకున్నామని ప్రచారం చేసుకుంటూ ఓట్లు అభ్యర్థించనుంది. రిజర్వేషన్ల జీవోను న్యాయస్థానం తోసిపుచ్చితే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కోర్టు నిర్ణయం ఎలా ఉన్నా వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తీర్పు స్థానిక సంస్థలపై పెద్దగా ప్రభావం చూపదన్న భావన నెలకొంది.